West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం: సిచువేషన్ రూమ్‌లో ట్రంప్ అత్యవసర సమావేశం
ట్రంప్ అత్యవసర సమావేశం

West Asia Crisis: పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచువేషన్ రూమ్‌లో కీలక సమావేశం నిర్వహించారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం, ఇరాన్‌తో తాజా ఉద్రిక్తతల కారణంగా ఈ అత్యవసర భేటీ జరిగింది.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హార్ముజ్‌లో ఆటంకం లేకుండా సముద్ర రవాణా కొనసాగేలా చూడటం, ఇరాన్ అణు కార్యక్రమాలపై డిమాండ్లు అంగీకరించేలా ఒత్తిడి తెచ్చేందుకు దాడులకు సిద్ధమవడం వంటి అంశాలపై చర్చించినట్లు మీడియా సమాచారం. గత సంవత్సరం జూన్‌లో ఇరాన్‌పై దాడుల సమయంలో కూడా ఈ సిచువేషన్ రూమ్ నుంచే ట్రంప్ పర్యవేక్షించారు.
వైట్ హౌస్ వెస్ట్ వింగ్ బేస్‌మెంట్‌లో ఉన్న ఈ సిచువేషన్ రూమ్ సుమారు 5,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కాన్ఫరెన్స్ రూమ్, ఇంటెలిజెన్స్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో అధ్యక్షుడు, సలహాదారులు ఇక్కడ సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తారు.
ఇంతలో తాజా దాడుల్లో అమెరికా ఇరాన్‌లోని చాబహార్ నగరంలోని నౌకాదళ వాచ్ టవర్‌ను మళ్లీ లక్ష్యం చేసుకుంది. క్షిపణి దాడితో ఆ టవర్ ధ్వంసమైంది. గతంలో కూడా ఒకసారి ఈ టవర్‌ను అమెరికా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సముద్ర భద్రత, మత్స్యకారుల సహాయక చర్యల కోసం ఈ టవర్ ఉపయోగపడుతుంది.
పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

