Xi Jinping Says: అమెరికా పతనంలో ఉందన్న జిన్‌పింగ్.. అవునన్న ట్రంప్.. కానీ బైడెన్ హయాంలోనే!
కానీ బైడెన్ హయాంలోనే!

Xi Jinping Says: అమెరికా పతనం అంచున ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించగా, దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకీభవించారు. అయితే, ఆ పతనం మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనా కాలంలో జరిగిందని ట్రంప్ స్పష్టం చేశారు. తన పాలనలో అమెరికా అసాధారణమైన పురోగతి సాధించిందని గర్వంగా ప్రకటించారు. ఈ విషయాలను ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక దీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాను ‘క్షీణిస్తున్న దేశం’గా అభివర్ణించారని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “నిద్రమత్తులో ఉండే జో బైడెన్ పాలనను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో నేను జిన్‌పింగ్‌తో 100% ఏకీభవిస్తాను” అని ట్రంప్ తెలిపారు.
బైడెన్ పాలనలో బహిరంగ సరిహద్దులు, అధిక పన్నులు, దారుణమైన వాణిజ్య ఒప్పందాలు, పెరిగిన నేరాలు వంటి అనేక సమస్యల వల్ల అమెరికా అపార నష్టాలు చవిచూసిందని ట్రంప్ విమర్శించారు. తన 16 నెలల పాలనలో దేశం రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లు, కొత్త పెట్టుబడులు, వెనెజువెలాలో సైనిక విజయం, ఇరాన్‌పై చర్యలు వంటి అనేక విజయాలు సాధించిందని వివరించారు. “ఇంత తక్కువ కాలంలో ఇన్ని అద్భుతాలు సాధించినందుకు జిన్‌పింగ్ నన్ను అభినందించాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
రెండేళ్ల క్రితం అమెరికా నిజంగా పతనం అంచున ఉందని, కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో సంబంధాలు మరింత బలోపేతం, మెరుగ్గా ఉంటాయని ఆశా వ్యక్తం చేశారు.

