Yunus Takes a Strong Oath: యూనస్ కీలక ప్రమాణం: భారత వ్యతిరేక నేత హాదీ ఆదర్శాలు కొనసాగిస్తాం
భారత వ్యతిరేక నేత హాదీ ఆదర్శాలు కొనసాగిస్తాం

Yunus Takes a Strong Oath: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత వ్యతిరేక వైఖరికి పేరుగాంచిన ఇంకిలాబ్ మంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియల్లో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో యూనస్ మాట్లాడుతూ.. ‘‘ప్రియమైన ఉస్మాన్ హాదీ.. మేం ఇక్కడికి నీకు వీడ్కోలు చెప్పేందుకు రాలేదు. బంగ్లాదేశ్ ఉన్నంత వరకు నువ్వు ఈ దేశ ప్రజల హృదయాల్లోనే ఉంటావు. అక్కడి నుంచి ఎవరూ నిన్ను తొలగించలేరు. నువ్వు మాకు చెప్పిన మాటలను నెరవేరుస్తామని, మీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాం. ఈ దేశ ప్రజలందరూ నీ బాటలోనే నడుస్తారు’’ అని ఎమోషనల్‌గా ప్రకటించారు.
హాదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో మమేకమయ్యే తీరును యూనస్ ఎనలేని మెచ్చుకోలుగా ప్రశంసించారు. ఆయన ఇచ్చిన ‘మంత్రం’ ఎప్పటికీ బంగ్లాదేశ్ ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని, ప్రపంచం ముందు బంగ్లా తల ఎత్తుకుని నిలుస్తుందని.. ఎవరి ముందు తల వంచదని స్పష్టం చేశారు. అలాగే, ఎన్నికల్లో పాల్గొనాలన్న హాదీ కల గురించి కూడా గుర్తు చేశారు.
గతేడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈనెల ప్రారంభంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యాపించాయి. శనివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హాదీ అంత్యక్రియలు నిర్వహించారు.
యూనస్ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. భారత వ్యతిరేక ధోరణులను ప్రోత్సహించేలా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

