Zelenskyy Warns: యుద్ధం ముగిసే వరకు రష్యా ఆర్థిక జీవనాడులపై దాడులు కొనసాగించేస్తాం: జెలెన్‌స్కీ హెచ్చరిక
జెలెన్‌స్కీ హెచ్చరిక

Zelenskyy Warns: ఉక్రెయిన్ దళాలు రష్యా చమురు సౌకర్యాలపై డ్రోన్ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. రష్యాలోని స్టావ్‌రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాల్లోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు.
యుద్ధాన్ని ముగించడానికి మాస్కో నిరాకరిస్తున్నందున ఈ దాడులు తీవ్రం చేస్తున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. యుద్ధం ముగించాలని ఉక్రెయిన్ పలుమార్లు ప్రతిపాదించినా రష్యా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రష్యాలో ప్రతిరోజూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటామని హెచ్చరించారు. యుద్ధం ముగిసే వరకు రష్యా గుండెలపై కుంపటే కొనసాగించేస్తామన్నారు.
క్రిమియా సహా రష్యాలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. దాదాపు ఆరు చమురు డిపోలు ధ్వంసమయ్యాయని, వాటి నుంచి భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని వారు వెల్లడించారు. అజోవ్ సముద్రంలోని రెండు చమురు ట్యాంకర్లపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. సెర్బియాలోని కొన్ని రష్యా ఆస్తులపై కూడా ఉక్రెయిన్ దాడులు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ దాడులు చేస్తుండటంతో రష్యా పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత తలెత్తింది. ఇంధనం కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం తమ రక్షణ దళాలు 73 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరోవైపు, రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై 94 డ్రోన్లు, రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 72 డ్రోన్లను అడ్డుకున్నట్లు వారు వెల్లడించారు.
ఈ దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. యుద్ధం కొనసాగుతున్నందున రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

