లాజిస్టిక్స్ కారిడార్ గా కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం
సింగపూర్ లో జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్ సందర్శించిన cm చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక-లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పోర్టులను అనుసంధానంతో పాటు, పోర్టులకు సమీపాన ప్రపంచశ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం అన్నారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించింది. జురాంగ్ ఐల్యాండ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీలీ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి జురాంగ్ పెట్రో కెమికల్ కేంద్రాన్ని చూపించారు. వ్యూహాత్మకంగా ఈ కేంద్రం ఎంత కీలకమైన సేవల్ని అందిస్తోందన్న అంశాలను సీఎంకు వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికల్ని , వివిధ యుటిలిటీ మోడల్స్ తో పాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రికి చూపారు. పెట్రోకెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు ఇతర ఉత్పత్తులైన పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులకు వివరించారు. మొత్తం 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రో కెమికల్ హబ్ ను ఏర్పాటు చేసినట్టు జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్టు వివరించారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ తో పాటు సమీకృత భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్టనర్‌లుగా కలసి రావాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రితో జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్ ను మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు కూడా సందర్శించారు.
