Alipiri Checkpoint: తిరుమలకు దర్శనార్థం వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు శ్రీ వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్‌పాయింట్‌ (స్కానర్) వద్ద తన బ్యాగును అనుకోకుండా మరచిపోయారు. దీనిని గమనించిన ఆయన రాత్రి 11:30 గంటలకు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు.

భక్తుడి ఫిర్యాదుపై కమాండ్ కంట్రోల్ సిబ్బంది వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనాన్ని (TG 07 AD 0269) ట్రేస్ చేసి, తెల్లవారుజామున 3:30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నెం.4 వద్ద ఆ వాహనంలోని భక్తులను గుర్తించారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని, తాము స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు.

అనంతరం అధికారులు ఆ బ్యాగును పరిశీలించగా, అందులోని అన్ని వస్తువులతో పాటు 50 గ్రాముల బంగారం కూడా భద్రంగా ఉంది. వస్తువులన్నీ యథాతథంగా ఉండటంతో, సిబ్బంది ఆ బ్యాగును బాధితుడైన శ్రీ వంగ మల్లేష్ గౌడ్‌కు సురక్షితంగా అప్పగించారు.

సరైన సమయంలో స్పందించి, తిరుమలకు వచ్చే భక్తులకు భరోసా కల్పించిన తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది చొరవ మరియు అప్రమత్తతకు శ్రీ మల్లేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన కమాండ్ కంట్రోల్ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు

PolitEnt Media

PolitEnt Media

Next Story