
నైరుతి రుతు పవనాలు ఈ యేడాది ముందుగానే వచ్చేస్తున్నాయ్. మరో నాలుగు రోజుల్లో కేరళను తాకబోతున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ - ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు అండమాన్, శ్రీలంకలో విస్తరించాయి. ప్రతి యేడాదితో పోలిస్తే.. ఈ సారి పది రోజులు ముందుగానే కేరళను నైరుతి పలకరించ బోతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈసారి జూలై 8వ తేదీ నాటికి నైరుతి రుతు పవనాలు దేశమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది.
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చెప్పిన ఈ వార్తతో ఉపశమనం లభించనుంది. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో ఇప్పుడు విస్తరించాయి. ఇవి చురుగ్గా చురుగ్గా కదులుతూ, రాబోయే నాలుగు, ఐదు రోజుల్లోనే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా అయితే, నైరుతి రుతు పవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈ ఏడాది మే నెలాఖరులోనే పలకరించనున్నాయి.
రుతుపవనాల కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, జులై 8వ తేదీ నాటికి ఇవి దేశమంతటా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నామని వాతావరణ శాఖ పేర్కొంది.
