ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ నాటకాలు, వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు.

ఏం తమ్మీ మల్లేష్...అంత మంచిగేనా...అంటూ ఓ బడా శాల్తీ గబాలున వచ్చి ఎన్కాల వచ్చి..దబాల్న గొట్టి.. ఈపు సాపు జేసె ...ఎవ్రు సామీ నువ్... గిదేం పోయేగాలం...యాడికెల్లి వస్తివి...పొద్దుగాల నేనే దొర్కిన నీకు...అనుకున్న. గా మనిసి ఎన్కల పదిమంది వచ్చిన్రు. వంగి వంగి దండాలెడ్తూ...ఓ మల్లేసన్నా జర మా అంజన్నని జూస్కోవాలె...మీ గల్లీకొచ్చిండు...మీ గుమ్మం కాడికొచ్చిండు... అంటూ ఓ బక్కాయన మీసాలు దువ్వుకుంటూ నవ్వె...గింతలా అంజన్న ...అరే తమ్మీ మునిసిపల్ ఎలచ్చన్లొచ్చినయ్... గా మాత్రం తెల్వదా...గీ బారి మన వార్డుల పోటీ జేస్తున్న ...ఓటేయాలె మల్ల...సమజయిందా... అంటూ ముందుకెల్లె...జూసినవా కాకా ....గిట్లుంటది ప్రచారానికొచ్చినోల్ల కత.


గీ నామినేసన్ల కత ముగిసె . పార్టీ పెద్దోల్ల మాట ఇన్నోల్లు గప్ చుప్ అయిన్రు. పోటుగాల్లమనేటోల్లు మాత్రం మేం పోటీ చేసేదే...అని రెబెల్స్ గా నిలిసిన్రు. అయినా కేండెట్లు లచ్చలు లచ్చలు పెట్టాలే ...గంతేగా. కౌన్సిలర్ పోటీ జేస్తే అర కోటి...ఛైర్మన్ ,మేయర్ గావాలంటే కోట్లు పెట్టాలె. వార్డుకు పది లచ్చలు పోయాలంట. పోటీ గట్టిగుంటే ఓటుకు పదివేలు ఇయ్యాలె. సరే గిదంతా పురానా లొల్లే గానీ ...గీ పెచారం కత సూసినావా... పెద్ద పార్టీ పెద్దోల్లు అమీ తుమీ అంటూ పుంజుల్లెక్క బరిలో దిగుతున్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు బరాబర్ అయిదు రోజులు బడా బడా మీటింగ్ లకి వస్తున్రు.


చెయ్యి పార్టీవోల్లు అధికారంలో ఉన్రు...పెచారం కూడా గట్టిగ సెయ్యాలె...ఆల్లకి ఇది ఇజ్జత్ కి సవాల్. ఏ మాత్రం లెక్కల్ తేడా కొట్టినా...ఖేల్ ఖతం అయితదని మస్తు పరేసాన్ల ఉన్రు. పువ్వు పార్టీ మాత్రం తక్కువున్నదా ఏంది...జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ కి వస్తున్రు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వస్తుండు. కారోల్ల జోరు మస్తుగుంది మల్ల....మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు...ఎమ్మెల్యేలు గల్లీ గల్లీల తిరుగుతున్రు. 2020 మునిసిపల్ ఎన్నికల్ల కారు జోరు శానా ఉండె. గిపుడు అంతా ఉల్టా పుల్టా...చెయ్యి హవా ఎక్కవాయె. గందుకే కాంగ్రెస్ గెట్టాగైనా గీ బారి అన్నీ కొల్లగొట్టాలని సూస్తుండె.


పెచారంలో మన సార్ల పెతాపం సూడుండ్రి గంతా గింతా కాదు. గల్లీ గల్లీల తిరుగుతునే ఉన్రు. ఇంటామె పిలగానికి నీల్లు పోస్తుంటే...అక్కా జర తప్పుకోరాదె ...పిలగాడికి నీల్లు పోస్తా అంటూ చేతిలో చెంబు లాక్కొనేటోల్లుంటరు. ఈల్ల గత్తర జూసి జడ్సి పిల్లగాడు గుక్కపడ్తే...అరే జర్రాగు పోజిస్తా అంటరు. ముసలాయన బండి తీస్తుంటే...అరే కాకా జర ఆగరాదే...బండి స్టార్ట్ జేసిస్తా అంటూ ముచ్చట పెడ్తరు. హోటల్ కెల్లి బజ్జీలేస్తరు...టీనీల్లు కాస్తరు...అబ్బబ్బా గేం చేయాలన్నా చేసేస్తరు.


అవ్ మల్లా .... గిట్లనే ఉంటయ్ ఈల్ల కతలు. గుడ్డలుతుకుతా..., బండ్లు కడుగుతా..., కసవునూకుతా..., ఇస్త్రీ చేస్తా ... అంటూ పల్టీలు కొడ్తరు.గీ ముచ్చట్లకేం గానీ ఒక్క విసయం చెప్పున్రి... ఈల్లందర్ని నిన్నటి దంక మన గల్లీల చూస్తిమా? అసలు మనతో ముచ్చట్లు బెట్టే తీరికుండెనా ఈల్లకి. ఎలచ్చన్లు రాగానే ....అబ్బో జనాలపైన మొహబ్బత్‌ ముంచుకొచ్చె. జర ఈ పని కానీండి... వేలిపైన చుక్కపడనీయండి ఆకాశానికెత్తినోల్లే... దడేల్న కింద పడేసి ఎల్లిపోతారు. మల్లీ అయిదేల్ల దాకా పత్తా ఉండరు. ఈల్లని నమ్మితే మునిగినట్టే... జర సూసుకున్రి జాగర్త మరి!

Politent News Web 1

Politent News Web 1

Next Story