Karnataka Congress MLA: కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి చుట్టూ ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు (డీకే) సీఎం పదవి కోసం 80 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు అభ్యర్థన చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జాతీయ మీడియా ప్రకారం, రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్‌కు ఒక అవకాశం ఇవ్వాలని 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌ను కోరారు. ఈ నిర్ణయం ఇప్పుడు అధిష్ఠానం చేతుల్లో ఉంది. మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ సభ్యులము. దానికి తగినట్లుగానే ప్రవర్తిస్తాం. యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి (సీఎం సిద్ధరామయ్య)కు అనుకూలంగా పదేపదే మాట్లాడటం కొంత ఇబ్బందికరంగా ఉంది. కానీ రాజకీయాల్లో క్రమశిక్షణే ముఖ్యం. తమ వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడటం సరికాదు. డీకేకు ఒక ఛాన్స్ ఇవ్వాలనేది మా అందరి కోరిక. అయితే దీని గురించి బహిరంగంగా ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించకూడదు’’ అని అన్నారు.

కర్ణాటకలో సీఎం పదవి చుట్టూ ఇటీవల కాలంలో ఊహాగానాలు, చర్చలు ఎక్కువైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డీకే శివకుమార్ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మద్దతు విషయం బయటపడింది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story