Bengaluru: బెంగళూరు రోడ్లపై ఏఐ స్మార్ట్ బిల్‌బోర్డ్‌లు.. పెండింగ్ చలాన్ల డిస్‌ప్లే వివాదాస్పదం
పెండింగ్ చలాన్ల డిస్‌ప్లే వివాదాస్పదం

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను మరింత ఆధునికీకరించారు. కార్స్ 24 సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన స్మార్ట్ బిల్‌బోర్డ్‌లు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
ఈ స్మార్ట్ బిల్‌బోర్డ్‌లు కెమెరాలు, వాహన డేటాబేస్‌లను ఉపయోగించి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను పరిశీలిస్తాయి. ఒక వాహనం బిల్‌బోర్డ్‌కు 100 మీటర్ల దూరంలోకి వచ్చినప్పుడు, ఆ వాహనానికి సంబంధించిన పెండింగ్ చలాన్లు లేదా పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిన వివరాలను సెకన్లలో డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. కొందరు ఈ విధానాన్ని బిజీ జీవనంలో మర్చిపోయిన విషయాలను గుర్తుచేసే సాధనంగా స్వాగతిస్తుండగా, మరికొందరు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
విమర్శకులు బెంగళూరు రోడ్లు గుంతలతో నిండిపోయాయని, వాటి గురించి ఇలాంటి డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై సమాచారం ప్రదర్శించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చని సూచిస్తున్నారు. ప్రజల కర్తవ్యాలను గుర్తుచేసే కర్ణాటక ప్రభుత్వం, తమ బాధ్యతలను మర్చిపోతోందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, వాహనదారుల వ్యక్తిగత వివరాలు, పెండింగ్ చలాన్లను బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై హెచ్చరికల కోసం మాత్రమే ఈ సాంకేతికతను ఉపయోగించాలని వాదిస్తున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, "రోడ్లపై గుంతల సమాచారాన్ని BBMP ఇంజనీర్లు, కమిషనర్లు, MLAల ఇళ్ల ఎదురుగా బిల్‌బోర్డ్‌లపై ప్రదర్శించగలరా?" అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ విధానం ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు అంబులెన్స్‌ల వివరాలను ప్రదర్శించి ట్రాఫిక్‌ను నియంత్రించే సలహా ఇచ్చారు. మొత్తంగా, ఏఐ సాంకేతికతను సరైన దిశలో ఉపయోగించడం లేదని బెంగళూరు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
