
దేశ రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. ఇక్కడ ప్రాంతీయాభిమానం ఎక్కువ. ఇక, తమిళనాడు పేరు వినగానే గుర్తొచ్చేవి రెండే రెండు పార్టీలు. ఒకటి డీఎంకే అయితే, మరొకటి అన్నా డీఎంకే. దశాబ్దాల నుంచి ఆ రెండు పార్టీల ఆధిపత్యమే తమిళనాడులో ఉంటోంది. ఈ మధ్యలో మరికొన్ని పార్టీలు స్థానికంగా పుట్టుకొచ్చేందుకు ప్రయత్నించినా.. ఈ రెండు పార్టీలు మినహా మరే పార్టీకీ అంత స్కోపు గానీ, స్పేసు గానీ దొరకడం లేదు. ఆ స్థాయిలో ఈ రెండు పార్టీలు తమిళనాడు జనంలో నరనరానా ఇమిడిపోయాయని చెప్ుకోవచ్చు.
అయితే, 2026లో జరగనున్న ఎన్నికల్లో మాత్రం తమిళనాడులో సరికొత్త రీతిలో రాజకీయాలు తెరంగేట్రం చేయనున్నాయి. అప్పుడు చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉందంటున్నారు. ఇప్పటినుంచే ఆ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జట్టు కట్టి పోటీ చేశాయి. అప్పటి అధికార పార్టీ వైసీపీని ఓడించాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇదే తరహా వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2026లో జరగనున్నే ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ, ఏఐడీఎంకే కూటమి కట్టాయి. అయితే, ఇటీవల హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకే కూడా తమ కూటమిలోకి చేరబోతోందంటూ నేతలు సంకేతాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలూ డీఎంకేకు అధికారాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నవే కాబట్టి జట్టు కట్టినా ఆశ్చర్యంలేదన్నది విశ్లేషకుల మాట.
అయితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపునకు సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషించాయి. అటు.. తమిళనాడులో కూడా ఎన్నికల్లో సామాజిక సమీకరణలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. వన్నియార్, తేవర్, ముక్కులతోర్, దళిత వర్గాలు ఇప్పుడున్న రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏఐడీఎంకే తేవర్, ముక్కులతోర్ వర్గాల్లో బలంగా ఉంది. విజయ్పార్టీ యువ ఓటర్లు, దళిత వర్గాలను ఆకర్షిస్తోంది. బీజేపీ పట్టణ మధ్యతరగతి ఓట్లపై ఆధారపడుతోంది. ఈ మూడు పార్టీలు జట్టుకడితే సామాజిక వర్గాల వారీగా ఓట్లను సమీకరించి డీఎంకే ఓటు బ్యాంకును చీల్చవచ్చు అని అనుకుంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడీఎంకే విడివిడిగా పోటీ చేసినా 20 నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఓటు షేర్ కలిపితే గణనీయమైన ప్రభావం చూపించింది. అయితే, విజయ్ పార్టీకి కమలం పార్టీపై వ్యతిరేకత ఉందంటున్నారు. మరి, ఈ పరిస్థితుల్లో కొత్త కూటమితో విజయ్ జట్టు కట్టే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లోబీజేపీ, ఏఐడీఎంకే కూటమి 2026 ఎన్నికల కోసం బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం మాత్రం ఖాయమన్న క్లారిటీ వచ్చేసింది. ఈ శక్తికి విజయ్ పార్టీ కూడా తోడైతే డీఎంకేను సులభంగా గద్దె దించవచ్చునని ఏఐడీఎంకే నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, ఏఐడీఎంకే నేతలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. అయితే, ఏపీలో వైసీపీపై వ్యతిరేకతతో కూటమి విజయం సాధించినట్లు, తమిళనాడులోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేసి విజయం సాధించాలని ఏఐడీఎంకే యోచిస్తోంది. కానీ, ఇంతవరకు విజయ్ పార్టీ నుంచి అలాంటి సంకేతాలు మాత్రం రాలేదు. పైగా తమిళనాడులో డీఎంకేకు, టీవీకే పార్టీల మధ్యే పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. మరి, ఈ పరిస్థితుల్లో తమిళనాట కూటమి సాధ్యమా? అన్న చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ తరహా కూటమి ఏర్పాటు అవకాశాలు ఉన్నా.. విజయం మాత్రం సామాజిక రాజకీయ డైనమిక్స్, పార్టీల సమన్వయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ, ఏఐడీఎంకే కూటమి ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, కూటమిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే.. డీఎంకే ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ద్రవిడ పార్టీగా డీఎంకేపై ప్రజల్లో ఉన్న క్రేజ్, అలాగే సంక్షేమ పథకాలు ఆపార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్న విశ్లేషణలూ వస్తున్నాయి. పైగా విజయ్ పార్టీ సింగిల్గానే రాణిస్తామన్న ధీమాతో ఉంది. మరోవైపు బీజేపీ, ఏఐడీఎంకే మధ్య గత ఎన్నికల నుంచి కొనసాగుతున్న విభేదాలు కూడా సవాళ్లుగా నిలుస్తాయి. మరి విభేదాలు పక్కనపెట్టి గెలుపుకోసం బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలు టీవీకేను తమవైపు తిప్పుకుంటాయా? లేదంటే ఎవరి దారిలో వాళ్లు ఓట్ల జాతరకు వెళ్తారా? అన్నది చూడాల్సి ఉంది.
