Amit Shah: లోక్‌సభ సీట్లు 816కి పెరుగుతాయి.. దక్షిణ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు: అమిత్ షా
దక్షిణ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు: అమిత్ షా

Amit Shah: లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రవేశపెట్టిన మూడు బిల్లులు సభామోదం పొందిన తర్వాత ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ సీట్లు 816కి పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు 50 శాతం పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని లోక్‌సభలో ప్రకటించారు.
మహిళా రిజర్వేషన్ అమలు కోసం లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచుతున్నామని, పెరిగిన సీట్లన్నీ మహిళలకే కేటాయించబడతాయని అమిత్ షా వివరించారు. మిగిలిన 543 సీట్లు ఓపెన్‌గా ఉంటాయని, వాటిలో కూడా మహిళలు పోటీ చేయవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు లాభం
ఈ పెంపు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 సీట్లు 38కి, తెలంగాణలో 17 సీట్లు 26కి పెరుగుతాయని అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల మొత్తం లోక్‌సభ సీట్లు 129 నుంచి 195కి చేరుతాయని చెప్పారు. ఇప్పటి 23.76 శాతం ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగి 23.87 శాతం అవుతుందని, దాదాపు 24 శాతం వద్దనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే అనుమానాలు పూర్తిగా తప్పని, ఎలాంటి నష్టం ఉండదని అమిత్ షా ధృవీకరించారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ అనుబంధ సవరణలు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన ఈ వివరాలు ఇచ్చారు.
ఈ చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏ మాత్రం తగ్గకుండా, ప్రస్తుత స్థాయిని కాపాడుకునేలా చూస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ఇది మహిళా సాధికారతకు మైలురాయి అని కూడా అమిత్ షా పేర్కొన్నారు.

