Anna Hazare: సోనియా వ్యాఖ్యలపై అన్నా హజారే ఘాటు స్పందన.. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు లేవని స్పష్టీకరణ
స్పష్టీకరణ

Anna Hazare: సామాజిక కార్యకర్త అన్నా హజారే బుధవారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వాదనను తిరస్కరించారు. తన 2011-2012 ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్యంగా మద్దతు ఇచ్చి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో పేర్కొన్నారు. దీనిని హజారే ఖండించారు.
‘‘ఇది తప్పు. నాకు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్తో ఎలాంటి సంబంధం లేదు. వారి కార్యక్రమాల్లో పాల్గొనను. నా దేశమే నా ప్రాధాన్యం’’ అని హజారే చెప్పారు. ‘‘నేను చేసేది సమాజం, దేశం కోసమే. ఏ పార్టీతోనూ నాకు సంబంధం లేదు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఓడిపోవడానికి నా ఆందోళన కారణమని చెప్పడానికి ఆధారం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
‘‘ఆమె అన్నా హజారేను చూడలేదు, నేను ఆమెను చూడలేదు. ఒకరినొకరు చూడకుండా ఏదో ఒకటి చెప్పడం ఎంతవరకు సమంజసం?’’ అని అన్నారు. బాధ్యతగల వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని, అస్పష్టంగా మాట్లాడటం వ్యక్తి ప్రతిష్టను తగ్గిస్తుందని పేర్కొన్నారు.
సోనియా గాంధీ ఆత్మకథలో ‘‘2012లో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కార్యకర్త బాబూరావు ‘అన్నా’ హజారే ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమానికి ముఖ్య వ్యక్తిగా ఎదిగారు. దాని కొంతమంది ప్రముఖ పాల్గొనేవారు ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్యంగా నిర్వహించి మద్దతు ఇచ్చాయని తర్వాత పేర్కొన్నారు’’ అని రాశారు.

