Annamalai: తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ నాయకుడు కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియాటుడే రౌండ్‌టేబుల్‌-తమిళనాడు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టీవీకే విజయం రాజకీయాలకు కొత్త ఊపిరి ఇచ్చిందని అభినందిస్తూనే.. ఈ ప్రభుత్వానికి దార్శనికత కనిపించడం లేదని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీలపైనా ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఓటర్లు కోరుకుంటున్న మార్పును అంగీకరించేందుకు అవి సిద్ధంగా లేవని అన్నారు. ఆడవారిని, అమ్మను రాజకీయాల్లోకి లాగడం, దూషించడం వంటి పాత పద్ధతుల్లోనే ఉండాలని కొందరు నాయకులు భావిస్తున్నారని అన్నామలై వ్యాఖ్యానించారు. రాజకీయ వారసులు క్షేత్రస్థాయిలో మార్పును అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారిని ‘భాజపా బీ టీమ్’ అని పేర్కొనడం దురదృష్టకరమని అన్నామలై చెప్పారు. ఆయన ఇటీవల భాజపా నుంచి బయటకు వచ్చి త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో విజయ్ పార్టీపైనా ఇలాంటి విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా నటి త్రిషపై డీఎంకే నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. కావేరీ నదీ జలాల అంశంపై జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి పరోక్షంగా త్రిష ప్రస్తావన తెచ్చి ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. తాను కావేరీ గురించే మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చినా.. రాజకీయంగా దుమారం రేపడంతో పాటు అరెస్టు అవ్వాల్సి వచ్చింది.

అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story