Ashok Gajapati Raju : గోవా గర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన అశోక్ గజపతి రాజు
ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ వంశీకుడు, సీనియర్ రాజకీయ వేత్త అశోక్ గజపతి రాజు శనివారం గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. దివంగత ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడల మంత్రివర్గంలో కీలక మంత్రి పదవులు నిర్వహించిన అశోక్ గజపతి రాజు 2014 ఎన్‌డీఎ భాగస్వామ్య పక్షంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడానికి 43 సంత్సరాల పాటు కొనసాగిన తెలుగు దేశం పార్టీకి అశోక్ గజపతి రాజు రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా గోవా బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో చీఫ్ జస్టిస్ అశోక్ గజపతి రాజుతో గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలు హాజరయ్యారు.
