Bulldozer in Assam : ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్న అస్సాం
బుల్డోజర్లను ఉపయోగించి 4000 వేల కట్టడాలు నేలమట్టం చేసిన అస్సాం ప్రభుత్వం

శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రభుత్వ భూముల రక్షణకు ఇంతకాలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆయుధంగా వాడిన బుల్డోజర్ వాహనాన్ని ఉపయోగించడానికి ఇప్పుడు అస్సాం రాష్ట్రం సిద్దమయ్యింది. అస్సాం రాష్ట్రంలోని ఉరియమ్‌ఘాట్‌లోని రెంగ్మా అటవీ ప్రాంతంలో మాఫియా గ్రూపుల ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూముల స్వాధీనానికి అస్సాం ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్‌ని ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా బుల్డోజర్లను ఉపయోగించి 8,900 బిగాల అటవీ భూముల్లో వెలసిన 4వేలకు పైగా అనధికార నిర్మాణాలను తొలగించి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈభూముల్లో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల్లో నివసిస్తున్న 1500 మంది కుటుంబాలను అస్సాం అధికారులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈచర్యతో అస్సాంలో సుపారీ మాఫియాగా పేరుపడ్డ అత్యంత ప్రమాదకర గ్యాంగులను కూకటివేళ్లతో పెకిలించినట్లు అయ్యింది. బుల్డోజర్లతో ఈ ఆక్రమణలను కూల్చివేయడం వల్ల అర్హులైన పేద కుటుంబాలకు ఉపసమనం లభించినట్లయ్యింది. మొత్తానికి అస్సాం ప్రభుత్వం అక్రమార్కులపై ఎక్కుపెట్టిన మొదటి బుల్డోజర్ లైవ్ దేశానికి ఒక దిశానిర్దేశం చేసినట్లయ్యింది. ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల స్పూర్తితో బుల్డోజర్ల వాడకం ఇకపై దేశమంతా పాకే అవకాశం ఉంది.
