Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం: హుండీ లెక్కింపు సిబ్బందిలో భారీ రాజీనామాలు!
భారీ రాజీనామాలు!

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల హుండీ లెక్కింపు సిబ్బందిలో భయం వ్యాపించింది. విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం లెక్కింపు సిబ్బంది సంఖ్య 12కి పడిపోయింది.
విరాళాల చోరీ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం గమనార్హం. ట్రస్టు వర్గాల ప్రకారం, విచారణ అనంతరం 40 మంది సిబ్బందిలో 15 నుంచి 20 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇప్పుడు వారిలోనూ కొందరు రాజీనామా చేయడంతో మొత్తం 20 మందికి పైగా సిబ్బంది వైదొలగారు. ఫలితంగా హుండీ లెక్కింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది.
లెక్కింపు కేంద్రంలో నిఘా మరింత కట్టుదిట్టం చేసిన తర్వాత రాజీనామాల సంఖ్య పెరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులను లోపలికి అనుమతించే ముందు ఇప్పుడు పలు దశల్లో తనిఖీలు జరుపుతున్నారు. ఇంతకు ముందు ట్రస్టు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉంటే చాలు అని ప్రవేశానికి అనుమతి ఉండేది.
ఈ నెల 13న సుప్రీంకోర్టు విచారణ: అయోధ్య విరాళాల చోరీపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారణ చేపట్టనుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్ ధర్మాసనం ముందు ఈ వ్యాజ్యం వెళ్తుంది.

