Champat Rai Resigns: అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇద్దరూ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల లెక్కింపు, నగదు నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది. ఇప్పటికే ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. ఆలయ ఖాతాల నుంచి సుమారు రూ. 7 నుంచి 7.5 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారిక లెక్కలు ఇంకా వెల్లడికాలేదు. రెండు రోజుల క్రితం SIT యూపీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో చంపత్ రాయ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంపత్ రాయ్ నైతిక బాధ్యత స్వీకరించి రాజీనామా చేశారు.

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రామమందిర నిర్మాణానికి ప్రజలు చేసిన విరాళాలు సక్రమంగా వినియోగమవుతున్నాయా అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story