Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం: విరాళాల చోరీపై ఆరెస్సెస్ తీవ్ర ఆందోళన.. ట్రస్ట్ లోపాలు సరిదిద్దాలి
ట్రస్ట్ లోపాలు సరిదిద్దాలి

Ayodhya Ram Temple: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి వచ్చిన భక్తుల విరాళాల చోరీ కేసు పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తొలిసారి స్పందించింది. ఈ ఘటన తమను తీవ్రంగా బాధపెడుతోందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే విచారం వ్యక్తం చేశారు.
తరతరాలుగా లక్షలాది భక్తుల త్యాగాలు, అంకితభావం వల్లనే శ్రీరామ జన్మభూమిలో ఈ భారీ ఆలయం నిర్మాణం జరిగిందని హోసబలే గుర్తు చేశారు. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను ప్రత్యేక అంశంగా పరిగణించి, ఆలయ నిర్వహణలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తక్షణం సరిదిద్దాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను హోసబలే కోరారు. దర్యాప్తు జరుగుతున్నందున నిందితులకు శిక్ష పడే వరకు భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనను అవకాశంగా తీసుకొని కొందరు హిందూ వ్యతిరేక శక్తులు రాజకీయ లాభాలు కోసం ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో రాజీనామా చేసిన ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు ట్రస్ట్ షో-కాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. జులై 6న జరగనున్న కీలక సమావేశంలో ఈ అంశంపై చర్చించి, విరాళాల అవకతవకలపై లిఖితపూర్వక వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గత ఐదేళ్ల ట్రస్ట్ ఖాతాలను తిరిగి ఆడిట్ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భక్తుల విరాళాలు సక్రమంగా ఉపయోగపడాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని అందరూ ఆశిస్తున్నారు.

