Bihar Elections: బిహార్ ఎన్నికలు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..
25 లక్షల దొంగ ఓట్లంటూ..

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతేడాది 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని, కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత అవకతవకలు చోటుచేసుకున్నాయని ఢిల్లీలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు.
హర్యానాలో మొత్తం రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 25 లక్షల ఓట్లు నకిలీవేనని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. తన బృందం 5.21 లక్షల డూప్లికేట్ ఓటర్లను గుర్తించిందని, ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి ఫేక్‌గానే ఉందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను బలపరచడానికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక బ్రెజిల్ నటి ఫొటోను ఉపయోగించుకుని సీమా, స్వీటీ, సరస్వతి వంటి పలు పేర్లతో ఏకంగా 22 సార్లు నకిలీ ఓట్లు రిజిస్టర్ చేసి వేశారని ఉదాహరణగా చెప్పారు.
హర్యానా అసెంబ్లీలో 90 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఓట్ల చోరీతో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలిందని రాహుల్ ఆరోపించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎన్నికల కమిషన్ వర్గాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని, ఫలితాలకు సవాలు చేసే పిటిషన్లు పరిమితమేనని గుర్తు చేశాయి. పంజాబ్-హర్యానా హైకోర్టులో కేవలం 22 ఎన్నికల సంబంధిత పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని కామెంట్ చేశాయి.

