PM Modi: స్వదేశీ ఉత్పత్తులనే కొనాలి, విక్రయించాలి: ప్రధాని మోదీ పిలుపు
విక్రయించాలి: ప్రధాని మోదీ పిలుపు

PM Modi: జీఎస్టీ సంస్కరణలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక లేఖను విడుదల చేశారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ‘‘తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపు స్ఫూర్తిని పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి వర్గాలు, వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలతో సహా అన్ని వర్గాలకు ఈ సంస్కరణలు ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తాయి. ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ప్రతి రాష్ట్రం పురోగతిని వేగవంతం చేస్తాయి. స్లాబ్‌ల తగ్గింపు వంటి సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ సరళీకృతం కావడంతో పాటు వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుంది’’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
‘‘గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఆదాయపు పన్ను మినహాయింపు రూ.12 లక్షల వరకు పెంచడం, జీఎస్టీ సంస్కరణల ద్వారా ఈ ఏడాది ఒక్కటే ప్రజలకు రూ.2.50 లక్షల కోట్ల ఆదా జరుగనుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు స్వావలంబన బాటలో నడవడం అత్యవసరం. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, విక్రయించాలని దుకాణదారులకు నా విజ్ఞప్తి. పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు సృష్టించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
