Calcutta High Court: కోల్‌కతా హైకోర్టు టీఎంసీకి షాక్.. రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత నియామకంపై స్టే నిరాకరణ
స్టే నిరాకరణ

Calcutta High Court: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయంతో టీఎంసీకి తీవ్ర సెట్‌బ్యాక్ ఏర్పడింది.
జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ వరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా కొనసాగవచ్చని అర్థం అవుతోంది. కేసు తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. ఇరు పక్షాలు అఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించింది.
టీఎంసీ నుంచి బహిష్కరించబడిన రితబ్రత బెనర్జీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నారు. తనకు 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ రితబ్రతను ప్రతిపక్ష నేతగా నియమించడంతో వివాదం మరింత తీవ్రమైంది.
ఈ నియామకం అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీని విస్మరించడమేనని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ మమతా బెనర్జీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు స్టే ఇవ్వకపోవడంతో రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతారని తెలుస్తోంది.
ఈ తీర్పు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది.

