Ram Temple: రామమందిరం విరాళాల చోరీ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న క్రమంలో కొత్త అవకతవకలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లా విచారణలో ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకొని నియామకాలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో ట్రస్ట్ సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశం ఏర్పడింది.

ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ ఉద్యోగాల్లో నియమించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్లు, సర్వీస్ అగ్రిమెంట్లు తదితర పత్రాలు పోలీసుల చేతికి అందలేదు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై కూడా నిఘా పెట్టనున్నారు. నియామకాల తర్వాత ఏవైనా భారీ మొత్తాల్లో లావాదేవీలు జరిగాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రా లాంటి వారు నియామకాల అక్రమాల్లో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రామమందిర విరాళాల దొంగతనం కేసులో అరెస్టైన 8 మంది నిందితులు గతేడాది జనవరి-ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా సమయంలో అత్యధిక విరాళాలు దోచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలో నిందితుల ఇళ్లపై బుధవారం అయోధ్య పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఒక యోగా కేంద్రం నుంచి ‘రామరాజ్య కోశ్’ పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటీఎం క్యూఆర్ కోడ్ ఉంది. నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా ఈ యోగా కేంద్రంలోని ఒక గదిలో గత 10 ఏళ్లుగా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కుంభకోణంలో ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిపై దర్యాప్తు చేయాలని ఈడీకి పోలీసులు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story