Water Disputes : ఆంధ్రా, తెలంగాణల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి సిద్దమైన కేంద్రం
రేపు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీయంలతో భేటీ కానున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి

రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్.పాటిల్ భేటీ కానున్నారు. రేపు 16వ తేదీ గురువారం నూఢిల్లీలోని జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీయం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీయం ఎనుముల రేవంత్ రెడ్డిలతో కేంద్ర మంత్రి సీఆర్.పాటిల్ భేటీ కానున్నట్లు జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ సమావేశం వివరాలు తెలియచేస్తూ అగర్వాల్ ఇరు రాష్ట్రాలకు సోమవారం లేఖలు రాశారు. సమావేశంలో చర్చించడానికి ఇరు రాష్ట్రాలు తమ ఎంజెడాలను వెంటనే పంపాలని ఆయన లేఖలో కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పాల్గొనే ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రతినిధుల బృందం వివరాలు కూడా తెలియ చేయాలని లేఖలో అగర్వాల్ సూచించారు.
