CJP: సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వును అడ్డుపెట్టుకొని నిరసనకారులపై కేసుల ఎత్తివేత విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పుతోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆరోపించింది. ఇటీవలి ఆందోళనల్లో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది.

సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ, మునుపటి చర్చల్లో కుదిరిన అంగీకారాలపై కేంద్రం రాతపూర్వక హామీలు అందించలేదని తెలిపారు. సుప్రీం మధ్యంతర ఉత్తర్వును ఆసరాగా చేసుకొని యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలనుకుంటోందని ఆరోపించారు. హామీలు నిలబెట్టుకోకపోతే ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.

ఈ నెల 20న నిరసనకారులపై పోలీసులు బలప్రయోగానికి దిగిన వ్యవహారంపై పార్లమెంటులో చర్చించాలని, పోలీసులనే కాకుండా కేంద్ర హోం మంత్రి పాత్రపైనా చర్చ జరపాలని సీజేపీ కోరింది. పరీక్షల అక్రమాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం బ్యాండెయిడ్ చర్యేనని, వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే పరిస్థితి చక్కబడుతుందని సౌరవ్ దాస్ అన్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా విద్యార్థులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించి, పరిస్థితి మారకపోతే భారీ శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించారు.

మరోవైపు బీజేపీ సుప్రీం ఉత్తర్వును స్వాగతిస్తూ, సిసలైన విద్యార్థులకు రక్షణ దక్కాలని, అయితే అల్లర్లకు పాల్పడినవారిని క్షమించకూడదని పేర్కొంది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story