Sonam Wangchuk: కేంద్రం యూటర్న్ – సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం ఎత్తివేత
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం ఎత్తివేత

Sonam Wangchuk: పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై జారీ చేసిన నిర్బంధ ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో గతేడాది సెప్టెంబర్‌లో లేహ్ ప్రాంతంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారని, ఆయన ప్రకటనల వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రం ఆరోపించింది. దీంతో జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు హోంశాఖ పేర్కొంది.
అయితే, లద్దాఖ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతంలో శాంతియుత వాతావరణం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించాలని ప్రభుత్వ ఉద్దేశమని హోంశాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం లద్దాఖ్‌లో కొనసాగుతున్న బంద్‌లు, నిరసనలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. అయినప్పటికీ, ఈ నిర్ణయం ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే ఉద్దేశం ఉందని తెలుస్తోంది.

