ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు

జూన్ 25, 1975న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవత్సరానికి
యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో
ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి
ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. అలాగే 1971
నుండి 77 వరకూ బాంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వి.వి.గిరి గారు అత్యయిక స్థితి
విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్టమొదటి సారి ప్రమాణస్వీకారం చేసిన
1966లోనూ, రెండవసారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితుల్లోనే
వుంది! అయితే ప్రజలమీద ఆ పరిస్థితి ప్రభావం లేదు!!
1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించబడింది. అత్యంత
వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ 'మచ్చ' ఇప్పటికీ
తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం
చేసుకుందామని, ఇప్పటి తరానికి తెలియజేద్దామని ఈ చిన్న ప్రయత్నం.
ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడానికి ముందు భారత దేశంలో రెండుసార్లు
సుమారు ఆరేసి ఏళ్ళ చొప్పున ఆత్యయిక పరిస్థితి కొ 'నసాగింది. అయితే ఇందిర పెట్టిన
అత్యవసర పరిస్థితి మాత్రం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారి తీసింది. అర్థ శతాబ్ది గడిచినా
ఇంకా ఆ నీలి నీడలు ఇందిరమ్మ వ్యక్తిత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ
నేపథ్యాన్ని విశ్లేషించేదే ఈ వ్యాసం...
జవహర్ లాల్ నెహ్రూ కూతురుగానే కాకుండా ప్రధానమంత్రి ఆంతరంగిక
వ్యవహారాలన్నీ చక్కబెట్టే సలహాదారుగా కూడా - ఇందిర - కాంగ్రెస్ వారందరికీ
చిరపరిచితురాలు.
1959లోనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమింపబడి కేరళలో కమ్యూనిస్టు
ప్రభుత్వాన్ని రద్దు చేయటం, చైనాకు వ్యతిరేకమైనా లెక్క చేయకుండా టిబెట్ బౌద్ధ
మతగురువు దలైలామాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించటం వంటి కీలక
నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానపాత్ర వహించారు.
1964లో తండ్రి నెహ్రూ ఆకస్మిక మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని
బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయన అభ్యర్థన మేరకు ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.
మంత్రిగా ఉండాలంటే ఎమ్.పి.గా ఉండక తప్పదు కాబట్టి రాజ్యసభ సభ్యురాలయ్యారు.
(నెహ్రూ కూతురైనప్పటికీ, అప్పటి వరకు ఆమె ఏ చట్టసభలోనూ సభ్యురాలు కాదు.)
1966లో శాస్త్రి గారి హఠాన్మరణంతో మళ్ళీ రాజకీయ నాయకత్వ శూన్యత
ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి అన్ని అర్హతలూ ఉన్న నాయకుడు!
ఆయనతో వై.బి. చవాన్ పోటీపడొచ్చునని లేదా వారిద్దరికీ రాజీ చేయవచ్చునని
పరిశీలకుల అంచనా!!
శాస్త్రిగారి మరణ వార్త వినగానే హుటాహుటిన ఢిల్లీ చేరుకున్న మద్రాస్
ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ ఆలోచన వేరేవిధంగా ఉంది. నెహ్రూ గారి
కూతురుగానే కాకుండా ఆయన ముఖ్య సహాయకురాలిగా ఇందిర ప్రపంచమంతా
తిరిగిన మనిషి. ప్రధానిగా ఇందిరైతే వచ్చే ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం
సులువవుతుందని కామరాజు అంచనా. అయితే ఆమె నెహ్రూ లాగే సోషలిజం వైపు
మొగ్గు చూపుతుందని అందరికీ తెలిసిందే! అతుల్యఘోష్, ఎస్.కె. పాటిల్, మొరార్జీ
దేశాయ్ వంటి నాయకులకు ఇందిర, నెహ్రూల సోషలిస్టు భావాల మీద సదభిప్రాయం
లేదు. ప్రధాని పదవికి పోటీ తప్పని సరయ్యింది. దాంతో పార్లమెంట్ భవనంలో జరిగిన
ఎన్నికలో ఇందిరకు 355, మొరార్జీకి 169 ఓట్లు వచ్చాయి. (ఉభయ సభలకు చెందిన
కాంగ్రెస్ ఎంపీలందరూ ఈ ఓటింగ్‌లో పాల్గొ 'న్నారు.)
24.1.19 66న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న
ఇందిరకు కేపిటలిస్ట్ భావజాలాన్ని బలపరిచే మొరార్జీ వంటి నాయకుల నుంచి
అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.
1967 సార్వత్రిక ఎన్నికల్లో (అసెంబ్లీలకూ, పార్లమెంట్‌కు కలిసి జరిగిన ఆఖరి
ఎన్నికలు) కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇందిర ప్రధానిగా ఎన్నికైనా... ఫలితాలు కాంగ్రెస్
బలహీన పడుతోందనే సంకేతాలు స్పష్టంగా పంపాయి. రాజగోపాలాచారి, ఎన్టీ రంగాల
స్వతంత్ర పార్టీ 44 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. గుజరాత్, మద్రాస్,
ఒరిస్సా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు
గెలుచుకోలేకపోయింది.
1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 1967లో ఇందిర
నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. అంటే 78 స్థానాలు
కోలో. యింది. నెహ్రూ - ఇందిరల సొంత రాష్ట్రం, దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ 249 నుంచి 199 స్థానాలకు పడిపోయి అధికారం
కోల్పోయింది.
భారతీయ జనసంఘ్ (ఇప్పటి బి.జె.పి.), కమ్యూనిస్టులు, ఇంకా ఇతర కాంగ్రెస్
వ్యతిరేక పార్టీల మద్దతుతో చౌదరీ చరణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు.
నెహ్రూ కూతుర్ని ముందు పెట్టుకుని ఎన్నికలకి వెళ్తే కాంగ్రెస్ లాభపడ్డ్తుందన్న
కామరాజ్ ప్రయోగం ఫలించలేదు!
ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్ నిలబడే అవకాశాలు కన్పించటం
లేదు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి సంకల్పించి, అమలు
చేయలేకపోయిన 'ఆవడి' కాంగ్రెస్ తీర్మానాలను దులిపి బైటకు తీసింది. ఉప ప్రధాని
మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా
మొరార్జీ ఉపప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).
వెంటనే బ్యాంకుల జాతీయకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ.
15.7.1969 నాటికి రూ.50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను
ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది.
'దారిద్యాన్ని తొలగిద్దాం' గరీబీ హఠావో అనే నినాదంతో ఇందిరాగాంధీ సొంత
ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
రచ్చకెక్కాయి.
భారత రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి నామినేషన్
దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను స్వయంగా ప్రధాని ఇందిర బలపరుస్తూ
సంతకాలు కూడా చేశారు.
అప్పటి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. “రాజేంద్ర
ప్రసాద్ సమయంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారు...
సర్వేపల్లి సమయంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతి అయ్యారు... నా
దగ్గరకొచ్చేసరికి ఎందుకు నన్ను తప్పిస్తున్నారు” అనేది ఆయన వాదన!
కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలన్నీ సి.డి. దేశ్‌ముఖ్ గార్ని నిలబెట్టాయి. ఈయన రిజర్వ్
బ్యాంకు గవర్నర్ గాను, నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రిగాను పని చేసిన వ్యక్తి (మన
దుర్గాబాయమ్మ గారి భర్త).
మొరార్జి, ఎస్.కె.పాటిల్, అతుల్యఘోష్ వంటి 'సిండికేట్' అని పిలవబడే
సోషలిస్టు వ్యతిరేక నాయకులందరూ బలపరిచిన సంజీవరెడ్డి గెలిస్తే... ఇందిర కథ
ముగిసినట్లే! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదించిన 'సంజీవరెడ్డిని ఓడించండి' అని
పిలుపునిస్తే... ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలి; అలాగా కథ ముగిసినట్టే!
ఇందిరాగాంధీ సొంత మనుషులందరూ వి.వి.గిరికి ప్రచారం మొదలుపెట్టేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డి.పి.మిశ్రా, యంగ్ టర్క్స్‌గా పిలవబడే చంద్రశేఖర్,
మోహన్ ధారియా, తదితరులు... ఇందిరకు అండగా వి.వి.గిరినే బలపరుస్తున్నారు.
కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప
చేసిన ఒక ప్రకటన ఇందిరకు వరమయ్యింది. సంజీవరెడ్డి ఓడిపోతారేమోనన్న భయంతో నిజలింగప్ప భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీల మద్దతు కోరడమే ఆ
పెద్ద తప్పు!
కాంగ్రెస్ విధానాలను ముందు నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న “జనసంఘ్”
(ఇప్పటి భారతీయ జనతా పార్టీ) వంటి పార్టీల మద్దతు కోరటం ద్వారా కాంగ్రెస్
అధ్యక్షుడు నిజలింగప్ప పాత్ర కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నట్లుందని... 'కాంగ్రెస్
వారంతా అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు చెయ్యాలని...” ఇందిర బహిరంగంగా
ప్రకటించింది. 20.08.1969న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వి.వి.గిరి అంత సులువుగా
గెలవలేదు... మొదటి లెక్కింపులో వి.వి.గిరికి నెగ్గటానికి కావల్సినన్ని ఓట్లు రాలేదు.
రెండవ లెక్కింపులో వి.వి.గిరి గెలిచారు. అత్యంత ఉద్రిక్తతల నడుమ జరిగిన లెక్కింపు
సమయంలో ఇందిరతో నున్న డి.పి. మిశ్రా తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నారు
(డి.పి. మిశ్రా కుమారుడే వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని
చేసిన బ్రజేష్ మిశ్రా). “వి.వి.గిరి ఓడిపోతున్నారు... ఇప్పుడు నేనేం చెయ్యాలి” అని
ఇందిర అడిగితే 'వెంటనే రాజీనామా చెయ్యాలి” అన్నారట మిశ్రా! రాజీనామా రాష్ట్రపతి
కివ్వాలంటే రాష్ట్రపతి లేరు... జాకీర్ హుస్సేన్ మరణం వల్లనే గదా ఈ ఎన్నిక... సుప్రీం
కోర్టు చీఫ్ జస్టిస్‌కి ఇవ్వాలన్న మాట...
అయితే మొదటి లెక్కింపులో నెగ్గకపోయినా ఆ తర్వాత లెక్కింపుల్లో పడ్డ రెండో
ప్రాధాన్యతా ఓటుతో వి.వి.గిరి గెలిచారు. అయినా అక్కడితో ఇందిర అధికార కష్టాలు
ఆగిపోలేదు.
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇందిరను సస్పెండ్ చేశారు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ సభ్యులు 429 మందిలో (లోకసభ రాజ్యసభ కలిపి) 310
మంది ఇందిర వైపు నిలిచారు. అయినా లోక్ సభలో ఇందిర మెజార్టీ కోల్పోయింది.
ఇందిరను ప్రధాని పదవి నుంచి వెంటనే దింేయాలన్న విరోధుల ప్రయత్నాలు
సి.పి.ఐ., డి.ఎమ్.కె. పార్టీలు, మరికొందరు ఇండిపెండెంట్లు తీసుకున్న
ఇందిరానుకూల నిర్ణయం వల్ల అమలుకాలేకపోయాయి.
ఇందిరాగాంధీ తెచ్చిన “బ్యాంకుల జాతీయకరణ” ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టు కొట్టి
వేసింది.
రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయం లోక్‌సభ
ఆమోదించినా... రాజ్యసభలో పాస్ కాలేదు.
మరోపక్క దేశాన్ని మిలటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా
వ్యాపించాయి. 1970 డిసెంబర్లో ఇందిరా గాంధీ లోక్‌సభను రద్దుచేసి మధ్యంతర
ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 'గరీబీ హఠావో” అంటూ ఇందిర... “ఇందిర
హఠావో' అంటూ వ్యతిరేకులూ నినదించిన ఆ ఎన్నికల్లో “ఆవుదూడ' గుర్తు మీద
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (ఆర్) ఘనవిజయం సాధించింది. ('ఆర్' అంటే రిక్విజిషన్)
సొంత ఎజెండా, సొంత బలంతో ఇందిర ప్రధానిగా ఎన్నికైంది. స్వయంగా మూడొందల
పబ్లిక్ మీటింగ్‌ల్లో మాట్లాడింది. 36,000 మైళ్ళు తిరిగింది. ర్యాలీలు, ఊరేగింపులు,
బహిరంగ సభలూ అంతటా తానై నిలిచింది. ఇందిరకు భారత ప్రజలు బ్రహ్మరథం
పట్టారు. అధికారం కట్ట బెట్టారు.
బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, పేదలకు ఇళ్ళ స్థలాలు, బ్యాంక్
లోన్లు, భూ పరిమితి చట్టం అమలు, లక్షలాది ఎకరాలు నిరుపేదలకు పంపిణీ... మన
శత్రుదేశం పాకిస్తాన్ నుండి విడగొట్టి 'బంగ్లాదేశ్' అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేయటంలో
ఇందిర ప్రధాన పాత్ర... ఇవన్నీ ఇందిరను జాతీయ - అంతర్జాతీయ నాయకురాలిగా
నిలబెట్టాయి.
1972లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇందిర పేరు
మార్కోగింది.
నిరుపేదల మనస్సుల్లో ఇందిర 'ఇందిరమ్మ'గా అవతరించింది. అత్యంత
ప్రజాదరణ కలిగిన నాయకురాలిగా ఎదిగిపోయిన ఇందిరను ఎదుర్కోగలిగిన,
దేశవ్యాప్తంగా ఆమెను మించి పేరు ప్రఖ్యాతులున్న నాయకులెవ్వరూ లేరు.
1974లో గుజరాత్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్ మెన్ చార్జీల
పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్
ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ (కాంగ్రెస్) వ్యతిరేక ఉద్యమంగా నవనిర్మాణ
ఆందోళనగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ఉద్యమాన్ని తీవ్రతరం
చేశాయి. పైకి ఈ ఉద్యమం చిమన్ భాయ్ పటేల్‌కి వ్యతిరేకంగా జరుగుతున్నట్లు
కనిపించినప్పటికీ వాస్తవంగా ఇది ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా నడిపిస్తున్న
ఉద్యమమే. తరువాత జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని మరింత బలపరిచాయి.
సాక్షాత్తూ జయప్రకాశ్ నారాయణ్ దిగడంతో... దాని విలువ విపరీతంగా పెరిగింది.
డెబ్బై ఏళ్ళ వయసున్న జయప్రకాశ్ సోషలిస్టు భావాలుగల స్వాతంత్ర్య
సమరయోధుడు. విదేశాల్లో చదువుకున్న జయప్రకాశ్, నెహ్రూ గారికి అత్యంత
సన్నిహితుడిగా గాంధీగారి ముఖ్య అనుచరుడిగా... దేశమంతటికీ తెలుసున్న వ్యక్తి.
1972లో చంబల్ లోయలోని బందిపోట్లతో సమాలోచనలు జరిపి వారి కష్టాలు
తెల్సుకుని వారిని మంచి జీవితాల వైపు మళ్ళించిన జయప్రకాశ్ నారాయణ...
మరోసారి హీరోగా పతాక శీర్షికల్లో కొనియాడబడ్డారు! ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ
గాంధేయ విప్లవకారుడు... గుజరాత్ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు
ప్రారంభమయ్యాయి!! మిగతా రాజకీయ వాదుల్ని చూసినట్లు ఆమె మచ్చలేని
మహామనిషి జయప్రకాశ్‌ని చూడలేదు కదా...
చిమన్ భాయ్ పటేల్ అవినీతికి వ్యతిరేకంగా గుజరాత్ నవనిర్మాణ సమితి
ఆందోళన హింసాత్మకంగా మారటం, కఠినంగా వ్యవహరించటానికి వీల్లేకుండా
జయప్రకాశ్ అందులో ముందుండటం... వంటి కారణాల నేపథ్యంలో 1974 ఫిబ్రవరిలో
చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు ఇందిర!
సంవత్సరం గడిచినా రాష్ట్రపతి పాలనే కొనసాగుతుండటంతో మొరార్జీ దేశాయ్ ఢిల్లీలో
ఆమరణదీక్ష ప్రారంభించారు. వెంటనే ఎన్నికలు జరిపించాలంటూ మొరార్జీ స్థాయి వ్యక్తి
ఆమరణ దీక్ష చేపట్టడంతో ఇందిరకు మింగలేని పరిస్థితి.
జూన్ 1975లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా తొలగించబడిన
చిమన్ భాయ్ పటేల్ సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేసి 12 సీట్లు గెలిచారు. కాంగ్రెస్(ఓ)
(ఓ' అంటే ఆర్గనైజేషన్) - జనసంఘ్ - భారతీయ లోక్‌దళ్ - సోషలిస్టు పార్టీలు కలిసి
పోటీ చేసి 88 సీట్లు గెలిచాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అధికారంలోకి
రావాలంటే 92సీట్లు గెలవాలి. కాంగ్రెస్(ఆర్) ఇందిరాగాంధీ నేతృత్వంలో 75 సీట్లు
గెలిచింది. చివరికి... ఏ చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాశ్
నేతృత్వం వహించేంత ఉద్యమం నడిచిందో అదే చిమన్ భాయ్ పటేల్ 12 సీట్ల
మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఉద్యమం చిమన్ భాయ్ పటేల్ మీద కాదు,
ఇందిరాగాంధీ మీదేనని స్పష్టమైంది! జయప్రకాశ్ నారాయణ్ ఈ ఉద్యమంలో
దిగడంతో ఇందిరా వ్యతిరేక వర్గం వైపు బలం మొగ్గు చూపింది. ఈ ఉద్యమం ఎటువైపు
దారితీసేదో ఊహించలేము కానీ మరో అనూహ్య సంఘటన దీన్ని అనుకోని మలుపు
తిప్పింది.
సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న జూన్ 12, 1975
నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. అలహాబాద్ హైకోర్టు రాయబరేలీ
నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది.
ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్లో చేసిన ఆరోపణలపై
విచారించిన జస్టిస్ సిన్హా రెండు కారణాలవల్ల ఇందిర ఎన్నిక చెల్లదన్నారు.
1. ప్రభుత్వోద్యోగి యశపాల్ కపూర్ ఉద్యోగానికి చేసిన రాజీనామా ఆమోదించబడక
ముందే ఇందిరాగాంధీ ఎన్నికలో పాల్గొన్నాడనీ.
2. ఇందిర ప్రసంగించిన వేదిక ఖర్చు, వేదికకు సప్లె చేసిన విద్యుత్ చార్జీలు
ప్రభుత్వమే చెల్లించిందనీ....
మిగతా ఆరోపణలు - ఓట్లు కొన్నారనీ, హెలికాప్టర్ వాడారనీ, డబ్బు ఖర్చు
పెట్టారనీ, ఆవు-దూడ గుర్తుతో సెంటిమెంట్ రెచ్చగొట్టారనీ... ఈ ఆరోపణలన్నింటినీ
అలహాబాదు కోర్టు కొట్టివేసింది
ఇందిరాగాంధీని అనర్హురాలిగా తీర్పిస్తూ... అప్పీలు చేసుకోవటానికి కోర్టు 20
రోజుల టైమిచ్చింది కూడా...
యావద్భారతంలో ప్రతిపక్షాలన్నీ నిరసనలు మొదలుపెట్టాయి.
జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే
రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నానీ ఫాల్మీవాలా అత్యంత ప్రతిభావంతుడైన రాజ్యాంగ నిపుణుడు. ఇందిర
అనర్హత చట్ట విరుద్ధమని భావిస్తూ సుప్రీంకోర్టులో ఇందిర తరఫున తానే
హాజరయ్యాడు. (సుప్రీంకోర్టు వేసవి సెలవుల్లో ఉంది. ఒక్క వెకేషన్ బెంచి మాత్రమే
పని చేస్తోంది. అందుచేత అత్యవసరమైనా ఈ కేసుని వెంటనే విచారించలేకపోయారు.)
అప్పటిదాకా అలహాబాద్ తీర్పును స్ట చెయ్యాలని నానీ ఫాల్కీవాలా బలంగా
వాదించారు. జస్టిస్ కృష్ణయ్యర్ కండిషనల్ స్టే మంజూరు చేశారు... ప్రధానమంత్రిగాను,
పార్లమెంట్ సభ్యురాలిగాను కొనసాగవచ్చునని.. అయితే లోక్‌సభ సభ్యురాలిగా ఓటు
వేసే హక్కు మాత్రం ఉండదనీ ఉత్తర్వులిచ్చారు! అలహాబాద్ హైకోర్ట్ తీర్పు చెప్పిన
పదిరోజులకి జూన్ 22న ఈ స్టే రావటంతో పూర్తి తీర్పు ఇచ్చేవరకూ “ఇందిరా గాంధీ
ప్రధాన పదవికి ఇబ్బంది లేదు' అని అందరూ భావించినా... అలా జరగలేదు.
ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలోజయప్రకాశ్
నారాయణ్ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను
పాటించవద్దని మిలటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు
వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్ర్య పోరాటంలోకి దూకాలన్నారు.
మొరార్జీ దేశాయ్ గారు అయితే, ఒక విదేశీ జర్నలిస్టు 'ఓరియానా ఫాలసీ'తో
ప్రత్యేకంగా మాట్లాడుతూ... “రేపట్నుంచి ఇందిరను ఇంట్లోంచి బైటకు రానివ్వం...
రాజీనామా చేసేవరకూ ఇంట్లోకి బైటకు రాకపోకలు బంద్” అని ప్రకటించారు.
ఇలా ప్రకటించిన వీరిద్దరూ ఛోటా నాయకులు కారు! ఇందిర కన్నా సీనియర్లు...
పైగా ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూతో పని చేసిన దేశ నాయకులు!!.
25.06.1975 అర్ధరాత్రి, ఆర్టికల్ 352(1) అనుసరించి భారత అధ్యక్షుడు
ఫక్రుద్దీన్ అలి అహ్మద్” దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందిర ప్రెసిడెంట్‌కి వ్రాసిన అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే
క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నానని, ఆవిధంగా చేయడం
కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్-12కి లోబడే చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
రేపు తెల్లవారగానే క్యాబినెట్ మీటింగ్ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో
ప్రస్తావించారు.
ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.
07.11.1975న సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల బెంచ్ అలహాబాద్ తీర్పును
కొట్టివేసింది (కానీ ఎమర్జెన్సీ ప్రకటించినందుకు నిరసనగా పాల్కీవాలా మాత్రం ఇందిర
తరపున వాదించలేదు).
ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 23-07-75న లోక్‌సభ ఎమర్జెన్సీ
నిర్ణయాన్ని ఆమోదించింది. రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలం
గానూ, 59 మంది వ్యతిరేకం గానూ ఓటు చేశారు.
ఇందిర 'ఎమర్జెన్సీ' ఉదంతం జరిగి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! ఇప్పటికీ అదొక
చీకటి రాజ్యమని... ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె
వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్ 352 తీయబడిందనీ, ఆ
అధికరణం ప్రకారం ఎమెర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ
నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్ పార్టీయే "సారీ చెప్పాక అది తప్పే
అయివుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!
జూన్ 22న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు 'స్ట' చేసినా, జయప్రకాశ్
గారూ, మొరార్జీ గారూ ఇందిర రాజీనామా చేయాల్సిందేనని భీష్మించుకుని
కూర్చోవటం... దేశమంతా అల్లకల్లోలం అయిపోయేలా పోలీసులు, మిలట్రి,
ప్రభుత్వాదేశాలు పాటించవద్దనీ - విదార్థులు కాలేజిల్లోంచి పోరాటంలోకి రావాలనీ
సాక్షాత్తూ జయప్రకాశ్ స్థాయి నాయకుడు పిలుపివ్వటం.. ఏ రకంగా సమంజసమో
నాకైతే అర్థంకాలేదు. 1976 మార్చిలోపు ఇందిర మళ్ళీ ఎన్నికల కెళ్ళే టైం
వచ్చేస్తుంది. ఆర్నెల్ల సమయం మాత్రమే మిగిలింది ఇందిరకు. ఆర్నెల్లలో దేశ
వ్యాప్తంగా ఇందిర వ్యతిరేక ప్రచారం చేసుకునే అవకాశముండీ... వెంటనే రాజీనామా
చేయకపోతే “ఇంట్లోంచి బైటకు రానివ్వం... పోలీసులు, మిలటరీ తిరగబడండి' అని
అనవల్సిన అవసరమేంటో...!
యశపాల్ కపూర్ అనే “ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ తన రాజీనామాను
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 25-1-71న ప్రెసిడెంట్ ఆమోద
ముద్రపడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా
వుంది (విత్ రెట్రాస్పెక్టీవ్ ఎఫెక్ట్). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ
మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది.
సుప్రీంకోర్టులో జస్టిన్ కృష్ణయ్యర్ వంటి జడ్జి 'స్టే' ఇచ్చినా “లెక్క చేయం... నువ్వు
రాజీనామా చేయాల్సిందే” అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా!?
సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపునివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా
గాంధీ పార్టీ ఓడిపోవటం.. ఆవిడ కూడా ఎమ్.పి.గా గెలవలేకపోవటం... నిశ్శబ్దంగా
అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో
భాగమేనా!?
దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న మన రాష్ట్రంలో 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి
చీకటంటే అంత ఇష్టమా... అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి
ప్రభావం ఎందుకు చూపలేదు.
అంతటి ఘోర పరాజయంలో కూడా ఇందిరకు దేశవ్యాప్తంగా 34.5 శాతం ఓట్లు
వచ్చాయి. (2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన 36.6 శాతం కన్నా 2.1
శాతం మాత్రమే తక్కువ!) అన్ని పార్టీలు కలిసి ఇందిరను ఓడించాయి 'జనతా పార్టీ'
పేరుతో! అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 41.3 శాతం మాత్రమే!!
ఎమర్జెన్సీని దేశప్రజలు అధికశాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించ
కుండా జూన్ 26, 1975 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలదా!
ఒకవేళ అప్పుడు ఎమర్జెన్సీ కాకుండా ఏం చేసి వుంటే బాగుండేది!?
ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి
రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే
ఎన్నికలకు పోవడం.
ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం
పార్లమెంటులో జరిగింది గానీ.. రోడ్లమీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంటుంది!?
1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు
సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్‌సభ సీట్లు
గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది... ఒక "స్టే
చెయ్యబడ్డ... పూర్తిగా టెక్నికల్ అయిన కోర్టు తీర్పు అడ్డుపెట్టుకొని ప్రధాని గద్దె
దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్) ఏర్పడుతుంది!?
జయప్రకాష్ నారాయణలాంటి, నెహ్రూ ఇందిరల కన్నా ప్రముఖుడైన
సోషలిస్టూ, అమెరికా విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మార్క్సిజం గురించి
అధ్యయనం చేసిన వామపక్ష మేధావి నాయకత్వంలో... స్వతంత్ర, జనసంఘ వంటి
క్యాపిటలిస్టు పార్టీలు నడుస్తూ, సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపెయ్యాలి
అనుకున్నప్పుడు... లొంగిపోవాలా! తిరగబడాలా!!
ఇందిరా గాంధీ తిరగబడింది... పర్యావసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది.
పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన
చేశారో కూడా దేశం చూసింది..! “ఇందిరాకో బులావో.. దేశ్ కో బచావో' (ఇందిరను
పిలవండి దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని
చేశారు.
(ఇప్పటికీ 352 ఆర్టికల్ చిన్న సవరణతో అలాగే వుంది. అంతర్గత అలజడులు
(ఇంటర్నల్ డిస్టర్చెన్స్)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్‌డ్ రిబిలియన్)
అని సవరించారు.)
ఉండవల్లి అరుణ కుమార్
మాజీ పార్లమెంట్ సభ్యులు
రాజమండ్రి
