CJI Justice Surya Kant: డిజిటల్ మార్పులతో న్యాయం మరింత చేరువ: సీజేఐ సూర్యకాంత్
సీజేఐ సూర్యకాంత్

CJI Justice Surya Kant: న్యాయ వ్యవస్థలో సాంకేతికత వినియోగం పెరగడం వల్ల సామాన్యులకు న్యాయం వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భౌగోళిక దూరాలు, ప్రయాణ వ్యయాలు వంటి అడ్డంకులను డిజిటల్ విధానాలు తగ్గిస్తున్నాయని తెలిపారు.
‘సాంకేతికత - న్యాయ విద్య’ అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కేసుల పత్రాలు కోర్టుల స్టోర్‌రూమ్‌లకే పరిమితమయ్యేవని, ఇప్పుడు న్యాయ వ్యవస్థ బలమైన డిజిటల్ వేదికల వైపు అడుగులు వేస్తోందని చెప్పారు.
ప్రత్యేకంగా సిక్కిం వంటి కొండ ప్రాంతాల్లో న్యాయం కోసం కోర్టులకు వెళ్లడం గతంలో ఎంతో కష్టసాధ్యమని సీజేఐ గుర్తుచేశారు. ప్రతికూల వాతావరణం, ఇరుకైన మార్గాలు, దీర్ఘ ప్రయాణాలు కక్షిదారులకు పెద్ద సమస్యగా ఉండేవని, డిజిటల్ సాంకేతికత అలాంటి ఇబ్బందులను తొలగించే శక్తి కలిగి ఉందని వివరించారు.
న్యాయస్థానాల్లో ఈ-సేవా కేంద్రాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీషెల్స్, శ్రీలంక సుప్రీంకోర్టుల న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

