CJP: కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ఉగ్రంగా స్పందించింది. ఓటరు హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని, ‘జంతర్ మంతర్ 2.0’ తప్పదని హెచ్చరించింది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి” అన్నారు. ఎన్నికల ప్రక్రియను ‘మోసపూరితం’గా మార్చేశారని, పౌరుల ఓటు హక్కును కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు. “జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఢిల్లీలో నిరసన జరుపుతాం. రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ 2.0 తప్పదు” అని స్పష్టం చేశారు.

సీజేపీ సహ-కన్వీనర్ అశుతోష్ రంకా మూడు కీలక డిమాండ్లు పెట్టారు. మొదటిది – సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణ రాజీనామా చేయాలి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. రెండవది – రాబోయే అన్ని ఎన్నికలను వెంటనే నిలిపివేయాలి. అన్ని రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు ముందు ఉన్న ఓటరు జాబితాలను తిరిగి అమలులోకి తీసుకురావాలి. మూడవది – సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలి. పౌర సమాజ సంస్థలను కూడా పాల్గొనేలా కొత్త చట్టం తీసుకురావాలి. ఎస్‌ఐఆర్ మొత్తం ప్రక్రియపై స్వతంత్ర విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు సంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

“యువత దేశాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. ఓటు హక్కును తొలగించే అధికారం జ్ఞానేష్ కుమార్‌కు ఎవరు ఇచ్చారు? అందరం కలిసి ముందుకు రావాలి” అని దిప్కే పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, “ఎన్నికలు మోసపూరితమని తెలిసి కూడా పాల్గొని, అదే సమయంలో మోసం గురించి మాట్లాడటం సరికాదు. స్పష్టమైన స్టాండ్ తీసుకోవాలి” అని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఎస్‌ఐఆర్‌పై అంతర్గతంగా ప్రశ్నలు లేవనెత్తినట్లు వార్తలు వచ్చిన తర్వాతి రోజు వచ్చాయి.

Next Story