మహిళల ఖాతాల్లోకి రూ.7,500 కోట్లు

CM Mahila Rozgar Yojana Launched in Bihar: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.7,500 కోట్లు నేరుగా బదిలీ చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర మంత్రుల సమక్షంలో న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని మోదీ ఆరంభించారు.

‘‘నవరాత్రి సందర్భంగా బిహార్ మహిళల సంతోషంలో పాలుపంచుకుంటున్నాను. లక్షలాది మహిళల ఆశీస్సులు మాకు బలం. వారికి నా కృతజ్ఞతలు’’ అని మోదీ వర్చువల్ సమావేశంలో పేర్కొన్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు 75 లక్షల మంది మహిళలు నమోదు చేసుకున్నారని, వారి ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమ చేశామని తెలిపారు.

బిహార్ కోసం కృషి: నితీష్ కుమార్

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, మహిళల సాధికారత కోసం తాము ఎన్నో చర్యలు చేపట్టామని, ప్రధానమంత్రి కూడా మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలోని లాలూ ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని విమర్శించారు. లాలూ తన భార్యను ముఖ్యమంత్రిగా చేసి, కేవలం తన కుటుంబ లాభాల గురించి ఆలోచించారని ఆరోపించారు. తాము బిహార్ అభివృద్ధి కోసం కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని నితీష్ స్పష్టం చేశారు.

బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం చొరవతో ఈ పథకం ప్రారంభమైంది. మహిళల స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ యోజన రూపొందించబడింది. ప్రతి ఇంటిలోని ఒక మహిళకు జీవనోపాధి కోసం ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. తొలి విడతలో రూ.10,000, తర్వాత దశలవారీగా రూ.2 లక్షల వరకు సాయం అందిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story