Cockroach Janata Party (CJP): కాక్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాపై నమోదైన రెండో కేసును ఢిల్లీ పోలీసులు మంగళవారం (అక్టోబర్‌ 20) క్రైమ్‌ బ్రాంచ్‌కు బదలాయించారు. దీంతో ఈ ఇద్దరు నాయకులపై ఉన్న రెండు కేసులనూ ఇప్పుడు క్రైమ్‌ బ్రాంచ్‌ విచారిస్తుంది.

జంతర్‌ మంతర్‌ ప్రాంతంలోకి అనధికారంగా ప్రవేశించినట్లు ఆరోపణలతో నమోదైన మరో కేసును సోమవారం (అక్టోబర్‌ 19) క్రైమ్‌ బ్రాంచ్‌కు బదలాయించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 13న సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా, అజింక్య షిండేతో పాటు సీజేపీకి చెందిన మరో 11 మంది సభ్యులు ప్రైవేట్‌ ప్రాంగణాల గుండా అక్రమంగా జంతర్‌ మంతర్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతం నిరసన స్థలంగా గుర్తింపు రద్దు చేయబడిన తర్వాత కూడా వారు అలా ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు.

అక్కడ మోహరించిన పోలీసు సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు వినకపోవడంతో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. శాంతిభద్రతలు భంగపరిచినందుకు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను అక్టోబర్‌ 14న ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఐదు రోజుల న్యాయ నిర్బంధానికి పంపారు. సోమవారం వారి న్యాయ నిర్బంధాన్ని మరో రెండు రోజులు పొడిగించారు.

సీజేపీ నాయకులు ఈ కేసులపై ఢిల్లీ హైకోర్టులో న్యాయ నిర్బంధానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసి, తక్షణ విచారణ కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు కేసులనూ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదలాయించడం గమనార్హం. పోలీసు వర్గాల ప్రకారం, ఈ కేసులపై మరిన్ని వివరాలు సేకరించి విచారణను వేగవంతం చేయనున్నారు.

Next Story