సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ పిటిషన్

TVK Party: టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సంభవించిన తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ప్రమాదవశాత్తు జరిగినది కాదని, దాని వెనక పెద్ద కుట్ర ఉందని పార్టీ ఆరోపిస్తోంది. విజయ్ ర్యాలీలో అపరిచితులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని పిటిషన్‌లో పేర్కొంది. టీవీకే పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై 2025 సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి కరూర్ జిల్లాలో టీవీకే అధినేత విజయ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పోలీసుల నుంచి 10 వేల మందికి అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 50 వేల మంది అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. దీంతో రద్దీ అధికమై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. 11 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, ఈ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా పార్టీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట వెనక కుట్ర ఉందని ఆరోపిస్తూ టీవీకే పార్టీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story