Supreme Court: కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు అసహనం: ‘మసాలా కలిపారు'
‘మసాలా కలిపారు'

Supreme Court: బాలీవుడ్ నటి మరియు భాజపా ఎంపీ కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ మరియు జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కంగనా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ఇది కేవలం రీట్వీట్ కాదు, దీనికి మసాలా జోడించారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఈ కేసును కొట్టివేయాలన్న కంగనా అభ్యర్థనను హైకోర్టు కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
2020-21లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో 73 ఏళ్ల మహీందర్ కౌర్ అనే మహిళపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేసిన బిల్కిస్ బానో మరియు రైతు ఉద్యమంలో పాల్గొన్న మహీందర్ కౌర్ ఇద్దరూ ఒకే వ్యక్తి అని తప్పుగా పేర్కొంటూ కంగనా ఒక పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనాపై పరువు నష్టం కేసు నమోదైంది.
