మావోయిస్టులకు దేవుడైన డాక్టర్ రఫీక్ ఎవరు?

Dandakaranya Mystery Doctor: దండకారణ్య అడవుల్లో మావోయిస్టుల పాలిట దేవుడిగా మారిన వైద్యుడు ఒకరు. కనీస వైద్య సౌకర్యాలు కూడా లేని ప్రాంతంలో ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణాలు కాపాడిన ఆ మిస్టరీ డాక్టర్ పేరు డాక్టర్ రఫీక్. నిఘా సంస్థలకు కూడా చిక్కని ఈ రహస్య వ్యక్తి గురించి తాజాగా లొంగిపోయిన మావోయిస్టు సమాచారం ఇవ్వడంతో మరోసారి చర్చకు వచ్చాడు.

భద్రతా బలగాల ఎడతెగని ఆపరేషన్ల కారణంగా చాలామంది మావోయిస్టులు లొంగిపోతూ సాధారణ జీవితంలో చేరుతున్నారు. అలాంటి వారిలో ఒకరైన ఎం. వెంకటరాజు అలియాస్ చందు.. డాక్టర్ రఫీక్ గురించి కీలక వివరాలు వెల్లడించాడు. “ఉద్యమంలో చేరిన శిక్షణ పొందిన ఏకైక వైద్యుడు ఆయనే. అనేకమంది సీనియర్ నాయకులకు చికిత్స చేశారు. పరిమిత వనరులతోనే అత్యవసర శస్త్రచికిత్సలు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి” అని చందు తెలిపాడని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.

పంజాబ్‌కు చెందిన రఫీక్ అలియాస్ మణ్‌దీప్.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో దండకారణ్య అడవుల్లో వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్, తూటా గాయాలకు కుట్లు, బుల్లెట్ తొలగింపు వంటి చికిత్సలపై దళ సభ్యులకు, స్థానిక ఆదివాసీలకు శిక్షణ ఇచ్చారు.

“ఒకసారి భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు ఛాతీలో తూటా దిగబడింది. గుండెకు చాలా దగ్గరగా చిక్కుకున్న ఆ బుల్లెట్‌ను టార్చి లైట్ వెలుగులోనే శస్త్రచికిత్స చేసి తీసేశారు డాక్టర్ రఫీక్. అబూజ్‌మాఢ్ ప్రాంతంలోని మావోయిస్టు హెడ్‌క్వార్టర్స్ జోన్‌లో ఆయన సేవలు అందించేవారు. వైద్య సదుపాయాలు అందని ఆదివాసీలకూ చికిత్స చేశారు” అని చందు వివరించాడు.

2013లోనే రఫీక్ పేరు భద్రతా దళాలకు తెలిసింది. అరెస్టయిన మావోయిస్టుల నుంచి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టినా.. ఆయన వివరాలు రహస్యంగానే మిగిలాయి. 2018లో ఆయన భార్య రింకీ సీనియర్ కమాండర్ ప్రశాంత్ బోస్‌కు చికిత్స అందించినట్లు సమాచారం అందింది. అయితే 2016లోనే రఫీక్ దండకారణ్యాన్ని వదిలి ఝార్ఖండ్‌కు తరలివెళ్లినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కూడా ఆ రాష్ట్రంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ మిస్టరీ డాక్టర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story