Tejas fighter jets: రూ.62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు.. HALతో రక్షణ శాఖ ఒప్పందం
HALతో రక్షణ శాఖ ఒప్పందం

Tejas fighter jets: భారత వాయుసేన (IAF)లో సేవలందిస్తున్న మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక తేజస్ జెట్లను (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- Mk1A) ప్రవేశపెట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ.62,370 కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం ఖరారైంది.
ఈ 97 విమానాల్లో 68 సింగిల్-సీటర్ యుద్ధ విమానాలు, 29 ట్విన్-సీటర్ శిక్షణ విమానాలు ఉన్నాయి. ఈ తేజస్ జెట్లలో ఉత్తమ్ AESA రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థ, అధునాతన కంట్రోల్ యాక్యుయేటర్లు వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఈ విమానాల్లో 64%కు పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది.
2027-28 నుంచి ఈ విమానాల సమీకరణ ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు వాయుసేన సామర్థ్యాలను పెంచడమే కాకుండా, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్లలో ఏటా 11,750 ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని అంచనా వేశాయి. గతంలో 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో 83 తేజస్ విమానాల కొనుగోలుకు HALతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
