హెచ్‌1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ విదేశాలపై ఆధారపడటమే మన అతిపెద్ద శత్రువు అని అన్నారు. అమెరికా హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘నేడు భారత్‌ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా దేశం భరించాల్సిన నష్టాల్లో షిప్పింగ్‌ రంగం ఒకటని మోదీ తెలిపారు. 50 ఏళ్ల క్రితం మన దేశంలో తయారుచేసిన నౌకలనే మనం ఉపయోగించుకునేవాళ్లమని చెప్పారు. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగం పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. వారి ప్రభుత్వ హయాంలో స్వదేశంలో నౌకల తయారీపై దృష్టి పెట్టకుండా విదేశీ నౌకలకు అద్దెలు చెల్లించేందుకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అందువల్లే ఇప్పటికీ మన వాణిజ్యంలో 90 శాతం విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నామని అన్నారు. దీనికి గాను మనం ఏటా రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇది దేశ రక్షణ బడ్జెట్‌ కంటే ఎక్కువని తెలిపారు. ఇంతకుముందు భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story