S. Jaishankar: దౌత్యం టీ20 మాత్రమే కాదు.. టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి: జైశంకర్
జైశంకర్

S. Jaishankar: దౌత్యనీతి, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల కోణంలోనే చూడలేమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. కొన్ని అంతర్జాతీయ సమస్యలకు సహనం, దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని ఆయన అన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
“అంతర్జాతీయ సంబంధాలు సుదీర్ఘమైన, అనిశ్చిత ప్రక్రియలతో కూడుకున్నవి. ప్రభుత్వాలు, మీడియా భౌగోళిక రాజకీయ సమస్యలకు త్వరిత పరిష్కారాలు కోరుకుంటాయి. కానీ వాటి పరిష్కారం సుదీర్ఘకాలంలోనే రూపుదిద్దుకుంటుంది. మీడియాకు స్వల్పకాలిక పరిణామాలు అందించాల్సిన అవసరం ఉంది. అయితే వాస్తవ ప్రపంచంలో టెస్ట్ మ్యాచ్‌లూ ఉంటాయి. వాటి ఫలితాలు తక్కువ సమయంలో తేలిపోయేవి కావు” అని జైశంకర్ అన్నారు.
పశ్చిమాసియా యుద్ధాన్ని చాలామంది టీ20 మ్యాచ్‌లా భావించారని, కానీ అది టెస్ట్ సిరీస్ లేదా అంతకంటే ఎక్కువ కాలం సాగే ప్రక్రియగా మారిందని ఆయన ఉదహరించారు. ఉక్రెయిన్ యుద్ధం ఐదేళ్లు సాగుతోందని, ఇది టీ20 అంచనా కాదని చెప్పారు. దౌత్య ఫలితాలు తక్షణ హెడ్‌లైన్‌లతో లేదా సులభంగా గెలుపుగా కనిపించేవి కావని, అవి సుదీర్ఘకాల సంబంధాలు, పెట్టుబడులు, అప్‌స్ అండ్ డౌన్‌లతో కూడిన ప్రక్రియలని ఆయన వివరించారు. కష్టకాలంలో కూడా స్థిరంగా ఉండాల్సి ఉంటుందని అన్నారు.
నేటి అనిశ్చిత ప్రపంచంలో – భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యలు, మార్కెట్ అంతరాయాలు – వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలకు జైశంకర్ నాలుగు సూత్రాలు సూచించారు:
అంతరాయాల నుంచి తమను తాము కాపాడుకోవడం ప్రాధాన్యం. ‘డి-రిస్కింగ్’ తన అతి పెద్ద మంత్రం అని ఆయన అన్నారు.
ఎక్కువ మంది భాగస్వాములు, అధిక సంఖ్యలో సరఫరా వనరులపై ఆధారపడాలి. ఎంత ఎక్కువ ఆప్షన్లు ఉంటే అంత సురక్షితం.
ప్రపంచ మార్కెట్లు తరచూ భౌగోళిక రాజకీయాల వల్ల ప్రభావితమవుతాయని అంగీకరించాలి. ఇంధనం, ఎరువులు, రవాణా వంటివి ఉదాహరణలు.
అంతరాయాలు ఎప్పుడైనా రావచ్చని అంచనా వేసి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. వైవిధ్యం పాటించి, పెట్టుబడులకు భద్రత కల్పించుకోవాలి.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని పోటీ (competition), సంఘర్షణ (conflict), చోక్ పాయింట్లు (choke points) అనే మూడు సీలతో వర్ణించిన జైశంకర్, పరిష్కారంగా డి-రిస్కింగ్, డైవర్సిఫికేషన్, డిస్టార్షన్స్‌ను నిర్వహించడం, భద్రతా మార్జిన్ నిర్మించడం అనే నాలుగు డీలను సూచించారు. ‘జస్ట్ ఇన్ టైమ్’ యుగం ముగిసిందని, ‘జస్ట్ ఇన్ కేస్’ యుగం వచ్చిందని ఆయన అన్నారు.

