అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ - ప్రధాని మోదీ

Diwali Greetings - PM Modi: దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాసిన లేఖలో ఆపరేషన్ సిందూర్, అయోధ్య రామమందిరం, నక్సలిజం నిర్మూలన, సంస్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత జరుగుతున్న రెండో దీపావళిని పురస్కరించుకుని మోదీ తన లేఖలో శ్రీరాముడి బోధనలను గుర్తుచేశారు. ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం అవసరమని రాముడు నేర్పించారని అన్నారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ధర్మాన్ని పాటించడమే కాకుండా, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందని మోదీ వ్యాఖ్యానించారు.

దేశంలోని మారుమూల ప్రాంతాలు, జిల్లాల్లో కూడా ఈసారి దీపావళి దీపాలు వెలిగాయని, పండగను ఘనంగా జరుపుకున్నారని పేర్కొన్నారు. నక్సలిజం మరియు మావోయిజం దాదాపు అంతరించిపోయాయని, అందువల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అనేకమంది మాజీ తీవ్రవాదులు సమాజంలో కలిసిపోయి, రాజ్యాంగాన్ని నమ్మి అభివృద్ధికి తోడ్పడుతున్నారని మోదీ చెప్పారు.

దసరా, నవరాత్రుల సమయంలో జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించినట్లు తెలిపారు. ఇవి భవిష్యత్ తరాల కోసం చేపట్టిన సంస్కరణల భాగమని, దీనివల్ల ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అన్నారు. ఈ సంస్కరణలు జీవితాలను సులభతరం చేస్తాయని, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు.

'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కాపాడుకోవడానికి స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. అన్ని భాషల పట్ల గౌరవ భావన పెంచుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చమురు వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని, మెరుగైన ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు.

దీపావళికి కొత్త అర్థాన్ని ఇచ్చిన మోదీ, ఒక దీపం మరొకటి వెలిగించినప్పుడు కాంతి మరింత వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ పండగ సందర్భంగా సమాజంలో సామరస్యం, సహకారం, సానుకూలతను పెంచాలని ప్రజలను కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story