DMDK Joins DMK Alliance: డీఎండీకే డీఎంకే కూటమిలో చేరిక.. తమిళనాడు ఎన్నికల్లో కీలక మలుపు!
తమిళనాడు ఎన్నికల్లో కీలక మలుపు!

DMDK Joins DMK Alliance: తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశియ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) డ్రవిడ మున్నేత్ర కళగం (డీఎంకే) నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు.
డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ గురువారం డీఎంకే ప్రధాన కార్యాలయం 'అణ్ణా అరివలయం'లో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిశారు. ఆమెతో పాటు పార్టీ కోశాధికారి ఎల్.కె. సుదీశ్, కార్యదర్శి పార్థసారథి, ఉప ప్రధాన కార్యదర్శులు చంద్రన్, పన్నీర్‌సెల్వం హాజరయ్యారు. ఈ సమావేశంలో డీఎండీకే డీఎంకే కూటమిలో భాగమవుతుందని అధికారికంగా ప్రకటించారు.
సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ప్రేమలత.. "రానున్న శాసనసభ ఎన్నికల్లో మేం డీఎంకేతో కలిసి పోటీ చేస్తాం. ఈ కూటమి 2016లోనే ఏర్పడాల్సి ఉండేది. పదేళ్ల తర్వాత ఇప్పుడు అది సాకారమైంది. సీట్ల సర్దుబాటు విషయంలో స్టాలిన్‌గారు త్వరలో ప్రకటిస్తారు" అని తెలిపారు. స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తూ ఆమె ఈ కూటమిని ఔపచారికం చేశారు.
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన 'ఎక్స్' ఖాతాలో ఈ అంశంపై హర్షం వ్యక్తం చేశారు. "డీఎండీకే లౌకికవాద, ప్రగతిశీల కూటమిలో చేరడం సంతోషకరం. ద్రావిడ మోడల్ ప్రభుత్వం కొనసాగడానికి, తమిళనాడు అన్ని విధాలా అభివృద్ధి సాధించడానికి కలిసి పనిచేద్దాం" అంటూ పిలుపునిచ్చారు.
దివంగత సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ 2005లో స్థాపించిన డీఎండీకే.. 2011లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. రాష్ట్రంలో డీఎంకేకు ప్రతిపక్ష స్థానం లేకుండా చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎంకే కూటమిలో చేరడం ద్వారా రాజకీయ సమీకరణలు మరింత బలపడనున్నాయి.
ఈ కూటమి తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. సీట్ల పంపకాలు, ఇతర కూటమి పార్టీలతో చర్చలు త్వరలో జరిగే అవకాశం ఉంది.

