కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో బౌద్ధులు ఎక్కువ! సాధారణంగా పండుగలు, వేడుకలకు బౌద్ధులు దూరంగా ఉంటారు. అయితే హేమిస్‌ ఫెస్టివల్‌ను మాత్రం ఘనంగా జరుపుకుంటారు. బౌద్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ వేడుక ఈ శని, ఆదివారాలు జరుగుతుంది. లడఖ్‌లోని లేహ్‌ ప్రాంతంలో జరిగే ఈ మహోత్సవం కోసం బౌద్ధులు లేహ్‌కు చేరుకున్నారు.



టిబెటన్ల క్యాలెండర్‌ అనుసరించి లూనార్‌ నెలలో పదో రోజును హేమిస్‌ పండుగగా జరుపుకుంటారు.. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటంటే.. టిబెట్‌ బౌద్ధమత స్థాపకుడు పద్మసంభవ జయంతి కావడం! అందుకే హేమిస్‌ ఫెస్టివల్‌ను అంత ఘనంగా జరుపుకుంటారు. మనదేశంలోనే అంకురించిన బౌద్ధం శాఖోపశాఖలై ప్రపంచమంతా విస్తరించింది.. మనదేశంలో అక్కడక్కడ బౌద్ధం పరఢవిల్లుతోంది.. లేహ్‌లో బౌద్ధులే ఎక్కువ! వీరి మత కేంద్రాలను మోనాస్టరీ అంటారు. బౌద్ధ మత సంస్కృతి సంప్రదాయాలకు ఇవి ప్రతీకలు. హిమాలయ పర్వతశ్రేణుల్లో మొనాస్టరీలు ఎక్కువగా కనిపిస్తాయి.



నిజానికి బౌద్ధ సన్యాసులకు పెద్దగా పండుగలంటూ ఉండవు. ఎప్పుడూ ధ్యానం, పీటకాలతోనే సమయం గడచిపోతుంటుంది. అయితే హేమిస్‌ ఫెస్టివల్‌ మాత్రం వీరికి విశిష్టమైనది. ఈ పండుగలో పాల్గొనేందుకు టిబెట్‌ బౌద్ధ గురువులు, సన్యాసులు వస్తారు. హేమిస్‌ మొనాస్టరీ చుట్టూ ఎన్నో ఆరామాలు ఉన్నాయి. ఇక్కడి ఆశ్రమంలో బుద్ధభగవానుడి తామ్ర విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అలాగే కాలచక్ర, లార్డ్‌ ఆఫ్‌ ఫోర్‌ క్వార్టర్స్‌కు సంబంధించిన వర్ణ చిత్రాలు ఈ బౌద్ధ ఆరామం గోడలను శోభాయమానం చేస్తున్నాయి. హేమిస్‌ ఫెస్టివల్‌ రోజున అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. స్కూళ్లకు కూడా సెలవు ఇస్తారు.



హేమిస్‌ ఫెస్టివల్‌ రోజున స్థానికులంతా సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. మహిళల వేషధారణ, ఆలంకరణ ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. మగవారు కొమ్ములు, డప్పులు, డ్రమ్ములు వాయిస్తుంటే లామాలు పవిత్ర మాస్కులు ధరించి నృత్యం చేస్తారు. ఈ సంప్రదాయ నృత్యాన్ని చామ్‌ అంటారు. ఈ పండుగలో చామ్‌ నృత్యమే ప్రధాన ఆకర్షణ! మాస్క్‌ డాన్స్‌ చేసే డాన్సర్లను చామ్స్‌ అంటారు. తాంత్రిక తంతులతో కూడిన వజ్రయానం బోధించేటప్పుడు మాత్రమే బౌద్ధులు చామ్‌ నృత్యాన్ని చేస్తారు. ఈ పండుగకు ఘనమైన చరిత్రే ఉంది. ఎనిమిదో శతాబ్దం నుంచి ఈ వేడుకను జరుపుకుంటున్నట్టు చరిత్ర చెబుతోంది. 12 వందల ఏళ్ల కిందటే అక్కడ తాంత్రిక బౌద్ధాన్ని పద్మ సంభవుడు పరిచయం చేశారట!

Politent News Web3

Politent News Web3

Next Story