Army Chief Upendra Dwivedi: చరిత్రలో ఉంటారా.. భూగోళంలో ఉంటారా? పాక్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక
పాక్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక

Army Chief Upendra Dwivedi: పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై కుట్రలు చేస్తే చరిత్రలో ఉంటారా లేదా భూగోళంపై ఉంటారా అని తామే నిర్ణయించుకోవాలని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని, ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరినీ ఒకే కోవలో చూస్తామని స్పష్టం చేశారు.
‘సేనా సంవాద్’ కార్యక్రమంలో వ్యాఖ్యలు
న్యూఢిల్లీలో విద్యార్థులతో ‘సేనా సంవాద్’ కార్యక్రమంలో మాట్లాడుతూ జనరల్ ద్వివేది ఈ మాటలు అన్నారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఊచకోతకు ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఉనికిని ప్రపంచానికి ఆధారాలతో సహా బయటపెట్టామని తెలిపారు.
పొరుగు దేశం తన తీరును మార్చుకోకపోతే ఆపరేషన్ సిందూర్ రెండో వెర్షన్ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల సుభిక్షం, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తుందని, దానికి అడ్డంకి సృష్టించేవారిని తగిన రీతిలో ఎదుర్కొంటుందని ఆయన ఉద్ఘాటించారు.
భవిష్యత్ కల:
ఆర్మీ చీఫ్ తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక కేఫ్ ప్రారంభించాలని కల గురించి కూడా విద్యార్థులతో పంచుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో విశ్రాంతి కల్పించే ఆ కేఫ్‌లో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాఫీ తాగుతూ సేదతీరే వాతావరణంలో నిర్ణయాలు, సంప్రదింపులు జరపడానికి అనువైన స్థలంగా ఉంటుందని అన్నారు.

