Rahul Gandhi: ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై తనతో బహిరంగ చర్చ జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించాలని హోంమంత్రి అమిత్ షాకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం సవాలు విసిరారు. “అమిత్ షా జీ, మోదీ జీని గందరగోళం చేయకండి. నాతో బహిరంగ చర్చ జరపాలని ఆయన్ను ఒప్పించండి. ఏ వేదికైనా, ఎప్పుడైనా సరే. భయపడకండి,” అని రాహుల్ హిందీలో ఎక్స్‌పోస్టులో రాశారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగదని అమిత్ షా చెప్పిన మాటలను, గురువారం (నవంబర్ 5) ప్రత్యేక సమావేశం పిలిచి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమేనని చెప్పిన మాటలను వీడియో మాంటేజ్‌గా చూపుతూ రాహుల్ ఈ సవాలు విసిరారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరామ్ రమేష్ కూడా ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ “ప్రధానమంత్రి కూడా టెలిప్రాంప్టర్ ఉపయోగించవచ్చు” అని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ ఇటీవల వరుసగా ప్రధానమంత్రిని బహిరంగ చర్చకు సవాలు చేస్తున్నారు. బుధవారం ఆయన “అదానీ జీ ఎన్‌డీటీవీలోనే చర్చ జరపండి మోదీ జీ. వేదిక మీదే, న్యాయమూర్తి కూడా మీరే — అదానీ జీ కావచ్చు లేదా మోహన్ భగవత్ జీ కావచ్చు. ఐదు నిమిషాల్లోనే నరేంద్ర మోదీ ‘దేశద్రోహి’ అని నిరూపిస్తానని హామీ ఇస్తున్నాను” అని రాశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఓట్ల దొంగతనంపై దేశం అడుగుతున్న ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

బీజేపీ నేతలు ఈ సవాలును తేలికగా తీసుకోవడం లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని వేదిక ఎంచుకోమని అడుగుతున్నారు. కానీ పార్లమెంటులోనే వేదిక ఉంది. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత. కొంత తీవ్రత, బాధ్యత చూపాలి” అని అన్నారు. గతంలోనూ రాహుల్ ప్రతిపక్షం దేశవ్యతిరేకులన్న ఆరోపణపై, తనపై ‘విదేశీ సంబంధాలు’ అని చేసిన ఆరోపణపై ఎందుకు దేశద్రోహ కేసు పెట్టలేదని ప్రధానమంత్రిని ప్రశ్నించారు.


Next Story