Udhayanidhi Stalin: కావేరీ జలాల సమస్యను నేపథ్యంగా తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర వివాదం రేపాయి. నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థం ధ్వనించేలా ఆయన మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్‌ చేశారు. విచారణ నిమిత్తం ఆయనను తంజావూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

సోమవారం జరిగిన నిరసనలో ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆ సమయంలో కార్యకర్తలు ‘త్రిష, త్రిష’ అంటూ నినాదాలు చేయడంతో ఆయన పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చి అనుచితంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని ఉదయనిధి వివరణ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలపై టీవీకే, భాజపా సహా అన్ని పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ‘‘ఇవి అసహ్యమైన, అవమానకరమైన వ్యాఖ్యలు. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఇది నిదర్శనం’’ అని టీవీకే నేతలు ఖండించారు. టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. భాజపా నేత అమిత్ మాలవీయ ‘‘సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ గతి పట్టింది. ఒక మహిళను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడినందుకు అరెస్టయ్యారు’’ అని వ్యాఖ్యానించారు. ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైగో, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా ఆయన మాటలను ఖండించారు. అయితే అన్బుమణి విజయ్ ప్రభుత్వం హడావుడిగా అరెస్టు చేయడాన్ని కూడా తప్పుపట్టారు.

ఉదయనిధి అరెస్ట్‌తో చెన్నైలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయనిధి తన ఇంటి వద్దే అదుపులోకి వెళ్లేటప్పుడు నవ్వుతూ కనిపించి, ‘‘ఎలాంటి పరిణామాలకు భయపడబోను. ఇదంతా జోక్‌లా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణ జరగనుంది.

డీఎంకే నేతలు మాత్రం ఉదయనిధి ప్రసంగంలో అవమానకరమైన అంశాలు ఏవీ లేవని, ఆయన త్రిష పేరే ప్రస్తావించలేదని చెబుతున్నారు. ‘‘ఇది ప్రభుత్వం చేస్తున్న అణచివేత చర్య. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యం’’ అని డీఎంకే నాయకురాలు కనిమొళి విమర్శించారు. ఉదయనిధి ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగగా, డీఎంకే కార్యకర్తలు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story