DRDO Creates History: దేశ రక్షణ రంగంలో భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త చరిత్ర సృష్టించింది. జూన్ 10, 11 తేదీల్లో నిర్వహించిన మూడు అత్యంత కీలకమైన క్షిపణి పరీక్షలు వరుసగా విజయవంతం కావడంతో దేశ రక్షణ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాలపై హర్షం వ్యక్తం చేశారు.

డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఇంటర్‌సెప్టర్ క్షిపణులు సుదూరం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించాయి. దీంతో భారత్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థలో అత్యాధునిక దేశాల సరసన నిలిచింది. సుదూర క్షిపణి ముప్పులను ఎదుర్కోవడంలో దేశ భద్రతా వ్యవస్థ బలమైన సామర్థ్యం కలిగి ఉందని స్పష్టమైంది.

ఇక, యాంటీ-షిప్ యుద్ధ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన నావల్ యాంటీ షిప్ మిసైల్-మీడియం రేంజ్ (NASM-MR) తొలి ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైంది. సముద్రంలో శత్రు యుద్ధనౌకలపై కచ్చితమైన దాడి చేసే సామర్థ్యం ఈ క్షిపణి ప్రదర్శించింది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ వ్యవస్థ భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయనుంది.

మూడు కీలక పరీక్షలు వరుసగా విజయవంతం కావడం డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించాయి. రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సాయుధ దళాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములైన అందరినీ అభినందించారు. ఈ విజయాలు దేశ భద్రతను మరింత పటిష్ఠం చేస్తాయని ఆయన తెలిపారు.

ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చాయని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story