టీఎంసీ అంతర్గత డేటాను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ ప్రయత్నం: మమతా ఆరోపణ

Mamata Alleges: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం ఉదయం రాజకీయ వ్యూహకర్తల సంస్థ ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్‌)పై దాడులు చేపట్టింది. ఐప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం సహా సంస్థకు సంబంధించిన పలు చోట్ల మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు పేరుతో సోదాలు జరిపింది.

ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీక్‌ జైన్‌ ఇంటికి చేరుకుని సంచలనం రేపారు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మనోజ్‌ వర్మతో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె, ఈడీ చర్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఈ దాడులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీని ఉసిగొల్పుతున్నారు. టీఎంసీ పార్టీ రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల జాబితాలు, రహస్య సమాచారం ఉన్న హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడానికే ఈ సోదాలు’’ అని మమతా ఆరోపించారు.

ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ జైన్‌ టీఎంసీ ఐటీ విభాగానికి అధిపతిగానూ పనిచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి టీఎంసీతో ఐప్యాక్‌ సహకారం కొనసాగుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు రాజకీయంగా ప్రేరేపితమని మమతా దుయ్యబట్టారు.

మరోవైపు, ఈడీ సోదాల సమయంలో ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వెళ్లడంపై ప్రతిపక్ష భాజపా నేత సువేందు అధికారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తుకు జోక్యం చేసుకోవడం అనైతికమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతో బెంగాల్‌ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story