CJI Justice Suryakant: విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్టు మోసాలకు బలి అవుతున్నారు: సీజేఐ ఆందోళన
డిజిటల్ అరెస్టు మోసాలకు బలి అవుతున్నారు: సీజేఐ ఆందోళన

CJI Justice Suryakant: డిజిటల్ అరెస్టు మోసాల వలలో ఉన్నత విద్యావంతులు కూడా చిక్కుకుపోవడం నిర్ఘాంతపరుస్తోందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. పదవీ విరమణ ప్రయోజనాల మొత్తాన్ని ఇటీవల ఒక వృద్ధురాలు పూర్తిగా కోల్పోయిన ఘటనను ఉదాహరణగా చెప్పుతూ ఆయన ఈ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు డిజిటల్ అరెస్టులపై స్వయంగా తీసుకున్న సుమోటో విచారణ సోమవారం జరిగిన సందర్భంలోనే ఆయన ఈ మాటలు అన్నారు.
డిజిటల్ అరెస్టు మోసాలు దేశవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఒక న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. విద్యావంతులు కూడా ఇలాంటి మోసాలకు బలి అవుతున్నది దురదృష్టకరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డి.పి. కొహ్లి స్మారకోపన్యాసం లో కూడా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ‘సైబర్ నేరాల సవాళ్లు – పోలీసులు, న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ నిందితుల బెయిల్ అభ్యర్థనల్ని పరిశీలించేటప్పుడు కేవలం ఒక్క కేసు ఫిర్యాదుకు పరిమితం కాకుండా పూర్తి వ్యవస్థీకృత నేర ముఠా విస్తృతిని, అదే తరహా నేరాలు కొనసాగించే అవకాశాన్ని, సమాజంపై దాని ప్రభావాన్ని కూడా లోతుగా మదింపు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపట్టడం, సీజేఐ ఇలాంటి కీలక సూచనలు చేయడం ప్రజలకు, న్యాయవ్యవస్థకు, పోలీసు యంత్రాంగానికి బలమైన సందేశం అని చెప్పవచ్చు. మోసాలకు ఎవరైనా బలి కావొచ్చని, అందుకే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సీజేఐ వ్యాఖ్యలు హెచ్చరికగా మారాయి.

