రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

Rajnath Singh Warns: పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను ఆయన శనివారం సందర్శించారు. అక్కడ తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత సాయుధ దళాలను రాజ్‌నాథ్ అభినందించారు. అయితే, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, మున్ముందు మరిన్ని చర్యలు ఉంటాయని సూచించారు. భారత్‌లోని క్షిపణి సాంకేతికత నుంచి శత్రు దేశాలు తప్పించుకోలేవని హెచ్చరించారు.

'ఆపరేషన్ సిందూర్ విజయం మనకు సాధారణ సంఘటన కాదు. ఇది మన విజయాలకు అలవాటును సూచిస్తోంది. మన శత్రువులు బ్రహ్మోస్ నుంచి ఎలాంటి తప్పింపు లేదు. పాక్‌లోని ప్రతి భాగం ఇప్పుడు మన క్షిపణుల రేంజ్‌లో ఉంది' అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని, భారత్‌లో పెరుగుతున్న స్వదేశీ సాంకేతికత మరియు సామర్థ్యాలకు చిహ్నమని ఆయన అన్నారు. దీని వేగం, ఖచ్చితత్వం, శక్తి ప్రపంచంలోనే ఉత్తమమైనవని వివరించారు. భారత సాయుధ బలగాలకు బ్రహ్మోస్ వెన్నెముకలాంటిదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, బ్రహ్మోస్ క్షిపణి భారత్ రక్షణ అవసరాలకు స్వావలంబనకు ప్రతీక అని అన్నారు. మన రక్షణ అవసరాలతో పాటు మిత్ర దేశాల రక్షణ అవసరాలను కూడా తీర్చగల సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story