గురువారం వాకింగ్‌లో సీయం స్టాలిన్‌తో ములాఖాత్ అయిన ఓపీఎస్‌

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీరుసెల్వం నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఓపీఎస్‌ అనుంగు అనుచరుడు పానుర్తి రామచంద్రన్‌ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. రామచంద్రన్‌ ఈ విషయం ప్రకటించిన సమయంలో ఆయన పక్కనే ఓపీఎస్‌ కూడా ఉండటం విశేషం. గురువారం ఉదయం వాకింగ్‌ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మంతనాలు చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే తమ వర్గం ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అయితే భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనే విషయంపై ఓపీఎస్‌ వర్గం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది నిర్ణయం తీసుకుంటామని ఓపీఎస్‌ వర్గం స్పష్టం చేసింది. పురచ్చితలైవి జె.జయలలిత నమ్మినబంటుగా పేరుపడ్డ ఓపన్నీరుసెల్వన్ని ఆమె ఉండగానే ముఖ్యమంత్రిని చేసింది. ఆ తరువాత జయలలిత మరణించిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎడప్పాడి పళనిస్వామితో ఓపీఎస్‌ కు మనస్పర్ధలు రావడంతో ఆయన్ను పళనిస్వామి అన్నాడీఎంకే నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి అన్నాడీఎంకే బహిష్కృత నేతగానే ఎన్‌డీఏ కూటమిలో ఓపీఎస్‌ వర్గం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తో వాకింగ్‌ మీటింగ్‌ అయిన కొన్ని గంటలకే ఓపీఎస్‌ వర్గం ఎన్‌డీఏ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించడం విశేషం. ఈమధ్య కాలంలో ఓపీఎస్‌ ప్రధాని నరేంద్రమోడీతో భేటీకి ప్రయత్నం చేసి అపాయింట్మెట్‌ దొరకకపోవడంతో విఫలమయ్యారు. ప్రధాని అపాయింట్మెంట్‌ దొరకకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఓపీఎస్‌ కేంద్రంపై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. అయితే తమిళ హీరో విజయ్‌ స్ధాపించిన టీవీకే పార్టీకి ఓపీఎస్‌ మద్దతు ఇస్తారని గత కొంత కాలంగా తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. అయితే గురువారం ఉదయం వాకింగ్‌ వేళ స్టాలిన్‌ తో మంతనాలు జరపడంతో ఓపీఎస్‌ ఎవరివైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story