External Minister S. Jaishankar: రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు: పశ్చిమాసియా సంఘర్షణలో భారతీయుల భద్రతకే ప్రాధాన్యం
పశ్చిమాసియా సంఘర్షణలో భారతీయుల భద్రతకే ప్రాధాన్యం

External Minister S. Jaishankar: పశ్చిమాసియాలో (వెస్ట్ ఏషియా) కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో భారతదేశం శాంతిని కోరుకుంటుందని, సంభాషణలు మరియు దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని పరిణామాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని తెలిపారు.
ఈ సంక్షోభ సమయంలో సంయమనం పాటించి, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 20నే ప్రకటన విడుదల చేసిందని జైశంకర్ గుర్తు చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో సహా పలువురు నాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘర్షణలు భారతదేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలపై గణనీయ ప్రభావం చూపుతాయని వివరించారు. ముఖ్యంగా ఇంధన భద్రతకు ఈ ప్రాంతం కీలకమని, అక్కడి నుంచే చమురు, గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు.
లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని, వారి భద్రత, శ్రేయస్సే ప్రభుత్వానికి ప్రధాన ఆందోళన అని మంత్రి స్పష్టం చేశారు. "అక్కడి భారతీయుల పైనే మా ఆందోళనంతా" అని ఆయన పేర్కొన్నారు. చిక్కుకున్నవారిని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు. భారత వినియోగదారుల ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైన చోట ఇంధన సంస్థలకు దౌత్య మద్దతు అందిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై దాడులు చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల సమీపంలో పేలుళ్లు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు.
ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్-దేనా'ను అమెరికా ముంచిన సంగతి తెలిసిందే. మరో నౌక 'ఐరిస్ లావన్' సాంకేతిక సమస్యతో శ్రీలంక తీరం వద్ద చిక్కుకుంది. తిరుగు ప్రయాణంలో కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కోరగా భారత ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపిందని జైశంకర్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌తో సంప్రదింపులు కష్టంగా ఉన్నప్పటికీ, మానవతా పరమైన కారణాలతో అనుమతి ఇచ్చామని సూచించారు.
ఈ పరిస్థితుల్లో భారతదేశం శాంతి, స్థిరత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ, దౌత్యపరమైన పరిష్కారాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చింది.

