Fitness Test Fees: పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులు భారీగా పెంపు: 20 ఏళ్లు పైబడిన కార్లకు రూ.2000, వాణిజ్య వాహనాలకు రూ.25,000 వరకు
20 ఏళ్లు పైబడిన కార్లకు రూ.2000, వాణిజ్య వాహనాలకు రూ.25,000 వరకు

Fitness Test Fees: పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదనను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ముందుకు తెచ్చింది. కొన్ని వారాల క్రితం వాహన రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఛార్జీలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ కార్ల ఫిట్‌నెస్ టెస్ట్‌కు రూ.2,000 వసూలు చేయనున్నారు. అలాగే, 15 ఏళ్లు పైబడిన ట్రక్కులు, బస్సులు (మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలు) ఫిట్‌నెస్ టెస్ట్‌కు రూ.25,000 వరకు ఛార్జీ విధించనున్నారు.
పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త, సురక్షితమైన, తక్కువ కాలుష్యం కలిగించే వాహనాల వైపు ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఫీజుల పెంపును చేపడుతోంది. ప్రైవేట్ వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఆర్‌టీఓలు ప్రైవేట్ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లను వాహనాన్ని పరిశీలించి జారీ చేస్తున్నాయి.
త్వరలో ప్రభుత్వం ఆటోమేటెడ్ టెక్నికల్ టెస్ట్‌లను దశలవారీగా ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేస్తోంది. వాణిజ్య వాహనాల కోసం కొత్త ఫీజు స్లాబ్‌లను రూపొందించనుంది. వాహనాల వయస్సు ఆధారంగా 10, 13, 15, 20 ఏళ్లకు వేర్వేరు ఫీజులు వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు ఒకే రకమైన ఫీజు వసూలు చేస్తున్నారు.
